పిన్నెల్లిని తప్పించే కుట్రలో అధికారులూ భాగస్వాములా?

ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వెంటనే కేసు పెట్టకుండా, అరెస్టు చేయకుండా ఆయన పారిపోయేందుకు అధికార యంత్రాంగమే అవకాశం కల్పించిందా? కేసు పెట్టడంలో జాప్యం చేయడంతోపాటు ఉద్దేశపూర్వకంగానే ఎఫ్‌ఐఆర్‌లో మొదట ఆయన పేరు చేర్చలేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

Updated : 23 May 2024 07:36 IST

ఎమ్మెల్యే పిన్నెల్లి పేరు మొదటే ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదు?


సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లో
ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు వెళుతూ నంబూరి శేషగిరిరావును హెచ్చరిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి


ఈనాడు, అమరావతి: ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వెంటనే కేసు పెట్టకుండా, అరెస్టు చేయకుండా ఆయన పారిపోయేందుకు అధికార యంత్రాంగమే అవకాశం కల్పించిందా? కేసు పెట్టడంలో జాప్యం చేయడంతోపాటు ఉద్దేశపూర్వకంగానే ఎఫ్‌ఐఆర్‌లో మొదట ఆయన పేరు చేర్చలేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు అందరు అధికారుల ప్రమేయముందన్న అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)గా వ్యవహరించిన పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 13న సంఘటన జరిగితే 20వ తేదీ వరకు ఎమ్మెల్యే పేరును నిందితుల జాబితాలో చేర్చకపోవడం ఆర్వో నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే, పోటీలో ఉన్న అభ్యర్థి మధ్యాహ్నం సమయంలో పోలింగ్‌ సిబ్బందితో సహా అందరూ చూస్తుండగా ఈవీఎంను ఎత్తి నేలపై విసిరికొడితే గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టడాన్నిబట్టే అధికారులు ఎమ్మెల్యేకు ఎంత అనుకూలంగా పనిచేశారో అర్థమవుతోంది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలోను వెబ్‌క్యాస్టింగ్‌ అందుబాటులో ఉన్నప్పుడు ఈవీఎంను ఎవరు ధ్వంసం చేశారో సీసీ టీవీ ఫుటేజీ చూసి తేలిగ్గా కనిపెట్టొచ్చు! సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆర్వో, బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులు చేయాల్సిన పనే అది. కానీ ఆర్వో, పోలీసు అధికారులు ఈ విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని సర్వీసు నుంచి డిస్మిస్‌ చేయవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఫిర్యాదు చేయడానికి రెండు రోజులా? 

పోలింగ్‌ కేంద్రంలో 13న మధ్యాహ్నం రామకృష్ణారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్‌ను ధ్వంసం చేసిన సంఘటనలు సీసీ టీవీలో రికార్డు అవడంతో పాటు అక్కడి పోలింగ్‌ సిబ్బందీ సెల్‌ఫోన్‌లో బంధించారు. కానీ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ పోలింగ్‌ అధికారి విషయాన్ని తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ ఎమ్మెల్యేపై భయభక్తులతో ఫిర్యాదు చేసేందుకు పోలింగ్‌ అధికారి ముందుకు రాలేదు. గుర్తుతెలియని వ్యక్తులు కంట్రోల్‌ ప్యానల్, వీవీ ప్యాట్‌ యంత్రాలను ధ్వంసం చేయడం వల్ల రూ.2వేల నష్టం వాటిల్లిందని స్థానిక వీఆర్వో జానయ్య ఈ నెల 15న ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సహా ఎవరి పేర్లూ దీనిలో ప్రస్తావించలేదు.

అధికారులకు విధులేంటో తెలియదా?

మాచర్ల నియోజకవర్గంలో బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐజీ కేడర్‌లో ఉన్న పోలీసు అధికారి శ్రీకాంత్‌ వెళ్లారు. ఆయన దృష్టికీ రాలేదా? వస్తే ఎందుకు పట్టించుకోలేదు? జిల్లా కలెక్టర్‌ ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘ఈవీఎంల ధ్వంసం, పోలింగ్‌ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించిన వారిపై చర్యల కోసం సీసీటీవీ  ఫుటేజీని పోలింగ్‌ జరిగిన మర్నాడే పోలీసులకు అందజేశాం’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా బుధవారం విలేకరులకు చెప్పారు. అప్పుడు ఎమ్మెల్యే పేరు మొదటే ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదు? ఎమ్మెల్యేపై భయభక్తులతో, ఆయన కుట్రలకు సహకరించే ఉద్దేశంతోనే అలా వ్యవహరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పాలన యంత్రాంగాన్ని నడిపే అత్యున్నత స్థాయి అధికారే వైకాపాకు మేలు చేసేలా వ్యవహారాలు నడిపేటప్పుడు కిందిస్థాయి అధికారులు ఆయన బాటలో నడవడంలో ఆశ్చరమేముందన్న విమర్శలూ ఉన్నాయి.

సీసీటీవీ ఫుటేజీ బయటకు రాకపోతే..!

సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం హుటాహుటిన స్పందించడంతో ఎమ్మెల్యే పేరును నిందితుల జాబితాలో చేర్చారు. లేకపోతే ఆ నిజాన్ని సమాధి చేసేసేవారని, ఎమ్మెల్యే పారిపోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదన్న విమర్శలొస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని