పిన్నెల్లి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరం

పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను బద్దలుకొట్టి, విధ్వంసం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది.

Published : 23 May 2024 05:18 IST

ఈనాడు, అమరావతి: పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను బద్దలుకొట్టి, విధ్వంసం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. ఈవీఎంను ధ్వంసం చేస్తూ ఎమ్మెల్యే నేరుగా పట్టుబడిన సాక్ష్యాధారాలు లభించడంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. పక్కా ఆధారాలు లభించడంతో శిక్ష పడటం ఖాయం. పాల్వాయిగేటు గ్రామంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. మూడు చట్టాల కింద 10 తీవ్ర సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ వివరాలను రెంటచింతల పోలీసులు మెమో రూపంలో స్థానిక కోర్టుకు సమర్పించారు. పిన్నెల్లిపై నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం ఆయనకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. రెండేళ్ల జైలు శిక్ష పడేలా పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేశారు. రెండేళ్ల జైలు శిక్ష పడితే ఎన్నికల్లో పోటీకి ఆరేళ్లపాటు అనర్హులవుతారని చట్ట నిబంధనలు చెబుతున్నాయి. 


ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు.. వాటికి పడే శిక్షలివే..

1) సెక్షన్‌ 143 - చట్టవిరుద్ధంగా గుమిగూడటం (అన్‌లాఫుల్‌ అసెంబ్లీ). ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా జైలు, జరిమానా 

2) సెక్షన్‌ 147-  అల్లర్లకు పాల్పడినందుకు. రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా జైలు, జరిమానా 

3) సెక్షన్‌ 448 -  ఇల్లు/కార్యాలయంలోకి అక్రమ చొరబాటు. ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా జైలు, జరిమానా

4) సెక్షన్‌ 427 - విలువైన వస్తువును ధ్వంసం చేయడం. రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా జైలు, జరిమానా 

5) సెక్షన్‌ 353 - ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకోవడం, భయపెట్టడం, దాడి, దౌర్జన్యానికి పాల్పడటం. రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా జైలు, జరిమానా 

6) సెక్షన్‌ 452 - విధులకు అవరోధం కలిగించాలని, గాయపరచాలనే ఉద్దేశంతో దౌర్జన్యంగా ఇల్లు/ కార్యాలయంలోకి అక్రమ చొరబాటు. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా 

7) సెక్షన్‌ 120బి - నేరపూర్వక కుట్రకు పాల్పడటం. ప్రధాన నిందితుడికి పడిన శిక్షతో సమానంగా నేర ఘటనలో భాగస్వాములైన వారికి అదే శిక్ష పడుతుంది.


ప్రజాప్రాతినిధ్య చట్టం

1) సెక్షన్‌ 131 - పోలింగ్‌ బూత్‌ల వద్ద, లోపల చట్టవిరుద్ధంగా వ్యవహరించడం. మూడు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా 

2) సెక్షన్‌ 135 - బ్యాలట్‌ పేపర్లు/ఈవీఎంలను పోలింగ్‌ బూత్‌ల నుంచి తొలగించడం, ధ్వంసం చేయడం. ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా 

పీడీపీపీ చట్టం-1984 (ప్రజాఆస్తులను ధ్వంసం నుంచి కాపాడే చట్టం)

1) సెక్షన్‌ 3 - ప్రజాఆస్తులను ధ్వంసం చేయడం. అయిదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని