ఏయ్‌.. జాగ్రత్త!

‘ఏయ్‌.. జాగ్రత్త’ అంటూ ఓ మహిళను నోటికొచ్చినట్లు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుర్భాషలాడారు. ఆయన అనుచరులూ రెచ్చిపోయారు. ఈ నెల 13వ తేదీన పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టడమే కాకుండా ఆ తరవాత బయటకు వచ్చి ఎమ్మెల్యే పిన్నెల్లి వీరంగం చేశారు.

Published : 23 May 2024 05:18 IST

మహిళను బెదిరిస్తూ దూషణలకు దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ఈవీఎం పగలగొట్టిన ఎమ్మెల్యేను అడ్డుకోవడమే ఆమె తప్పు
కర్రలు, రాడ్లతో పాల్వాయిగేటు గ్రామస్థులపై పిన్నెల్లి అనుచరుల దాడి
పోలింగ్‌ రోజున ఎమ్మెల్యే సాగించిన అరాచకాలెన్నో
బయటకొచ్చిన వీడియో క్లిప్పింగులు

మహిళను బెదిరిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

ఈనాడు, అమరావతి: ‘ఏయ్‌.. జాగ్రత్త’ అంటూ ఓ మహిళను నోటికొచ్చినట్లు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుర్భాషలాడారు. ఆయన అనుచరులూ రెచ్చిపోయారు. ఈ నెల 13వ తేదీన పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టడమే కాకుండా ఆ తరవాత బయటకు వచ్చి ఎమ్మెల్యే పిన్నెల్లి వీరంగం చేశారు. పోలింగ్‌ కేంద్రం బయట కూడా.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకకాండ సాగించారు. వాహనాల్లో పదుల సంఖ్యలో అనుచరులతో వచ్చారు. కర్రలు, రాడ్లు బయటకు తీసి.. పోలింగ్‌ కేంద్రం వద్దే గ్రామస్థులపై విరుచుకుపడ్డారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. కొందరు గ్రామస్థులు ఎదురుదాడికి దిగడంతో.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులు అక్కడ నుంచి వాహనాల్లో జారుకున్నారు. ఈ వీడియో కూడా బుధవారం బయటకొచ్చింది.

వైకాపా ఘనతేంటో ‘దేశం మొత్తం చూసింది’

దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తుందని.. ఐప్యాక్‌ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ అన్న మాటలు ఓట్ల లెక్కింపు జరగక ముందే    నిజమయ్యాయి. ఈవీఎంను ధ్వంసం చేసి వెళ్తుండగా ప్రశ్నించిన మహిళలను బెదిరిస్తూ, అసభ్యంగా దూషిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూసి.. ఇదా వైకాపా రాజకీయం అని దేశం ముక్కున వేలేసుకుంటోంది. ఇదిగో రెండు గంటల్లో మాచర్ల వస్తానంటూ బీరాలు పలికిన నాయకుడే.. పోలీసుల నుంచి తప్పించుకుంటూ వాహనాలు వదిలేసి, ఫోన్లు పక్కన పడేసి పారిపోతున్నారంటూ వస్తున్న వార్తలను.. ఎన్నికల ఫలితాలు వెల్లడికాకముందే దేశం చూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని