రామాలయంపైకి బుల్డోజర్‌ శుద్ధ అబద్ధం: ఖర్గే

కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయంపైకి బుల్డోజర్‌ను పంపిస్తుందనేది శుద్ధ అబద్ధమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. అన్ని మతాలు, విశ్వాసాలను కాంగ్రెస్‌ గౌరవిస్తుందని తెలిపారు.

Published : 23 May 2024 05:57 IST

దిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయంపైకి బుల్డోజర్‌ను పంపిస్తుందనేది శుద్ధ అబద్ధమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. అన్ని మతాలు, విశ్వాసాలను కాంగ్రెస్‌ గౌరవిస్తుందని తెలిపారు. 55 ఏళ్లపాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా ఎవరినీ పూజలు చేయకుండా అడ్డుకోలేదని, ఏ ఒక్కరి మంగళసూత్రాలను లాక్కొనిపోలేదని పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. ‘తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. అవి ముస్లింల కోసమా? మేం కూడా అలా పెంచుతామని చెబుతున్నాం. ముస్లింల ప్రసక్తి ఎందుకు? మేం ఏది చేసినా దానిపై అపోహ కలిగించాలని భాజపా చూస్తోంది’ అని చెప్పారు. భాజపాని ఓడించే వ్యూహంలో భాగంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను కలిసికట్టుగా ఉంచడానికే కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేస్తోందని ఖర్గే తెలిపారు. ‘‘సోనియా గాంధీ 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఆమెకు బాగా తెలుసు. ప్రియాంకా గాంధీ, రాహుల్‌ మా పార్టీ ఆస్తులు, ప్రచార తారలు. వయనాడ్, రాయ్‌బరేలీ రెండింటిలోనూ గెలిస్తే రాహుల్‌ ఏ సీటును అట్టిపెట్టుకుంటారో ఆయన వ్యక్తిగత నిర్ణయం’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని