లోక్‌సభ ఎన్నికల్లో 8,360 మంది పోటీ

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు దశల్లో 8,360 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసిన చివరి విడత అభ్యర్థుల సంఖ్యతో దీనిపై స్పష్టత వచ్చింది.

Published : 23 May 2024 05:59 IST

2014, 2019 ఎన్నికల కంటే ఎక్కువ

ఈనాడు, దిల్లీ: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు దశల్లో 8,360 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసిన చివరి విడత అభ్యర్థుల సంఖ్యతో దీనిపై స్పష్టత వచ్చింది. 4వ దశలో 96 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 1,717 మంది అభ్యర్థులు పోటీపడగా, ఈనెల 20వ తేదీన 5వ దశలో 49 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అత్యల్పంగా 695 మంది అభ్యర్థులు తలపడ్డారు. ఇప్పటివరకు అయిదు దశల్లో పూర్తయిన పోలింగ్‌లో 6,587 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఈనెల 25న 869 మంది, జూన్‌ 1న 904 మంది అభ్యర్థుల భవిష్యత్తుపై ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. అందరి జాతకాలు జూన్‌ 4న బయటపడనున్నాయి. 2019లో 8,054 మంది, 2014లో మొత్తం 8,251 మంది తలపడ్డారు. 2014, 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి అత్యధిక మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగారు. మరోవైపు, ప్రస్తుత ఎన్నికల్లో గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని