ఓట్ల కోసం దేశ భద్రతతో మమత రాజీ

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతిస్తూ దేశ భద్రతతోనే రాజీ పడుతున్నారని కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌ షా ఆరోపించారు.

Updated : 23 May 2024 06:23 IST

భాజపా అగ్రనేత అమిత్‌ షా ధ్వజం

కంతి/పురులియా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతిస్తూ దేశ భద్రతతోనే రాజీ పడుతున్నారని కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌ షా ఆరోపించారు. కంతి, ఘాటల్, పురులియా లోక్‌సభ స్థానాల పరిధిలో బుధవారం వరుసగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో అమిత్‌ షా ప్రసంగించారు. రాష్ట్రంలో 30 లోక్‌సభ స్థానాలను భాజపా గెలుచుకుంటే తృణమూల్‌ కాంగ్రెస్‌ విచ్చిన్నమైపోతుందని, మమతా బెనర్జీ ప్రభుత్వమూ అధికారాన్ని కోల్పోతుందని తెలిపారు. ‘చొరబాటుదారులకు బెంగాల్‌ స్వర్గధామంగా మారింది. వారి వల్ల రాష్ట్ర జనాభా స్వరూపం మారిపోవడమే కాక ఆ ప్రభావం దేశ భద్రతపైనా పడుతోంద’ని అమిత్‌ షా ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు కోసమే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) మమత వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. రామకృష్ణ మిషన్, భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ సాధువులపై విమర్శలను అమిత్‌ షా ఖండించారు. ఈ ఆధ్యాత్మిక సంస్థలు లేకుంటే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం.. బంగ్లాదేశ్‌లో భాగమవుతుందని మమతకు తెలియడంలేదంటూ ధ్వజమెత్తారు. విపక్ష ఇండియా కూటమి దేశవ్యాప్తంగా తుడిచిపెట్టుకు పోతుందని అమిత్‌ షా అన్నారు. ఆ కూటమిలో ప్రధాన మంత్రి పదవిని చేపట్టగల స్థాయి ఉన్న నాయకుడెవరూ లేరని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ జరిగిన అయిదు దశల ఎన్నికల్లో ప్రధాని మోదీకి 310కి పైగా సీట్లు వస్తాయని భరోసా వ్యక్తం చేశారు. ఈ దఫా బెంగాల్లో భాజపా 30 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించబోతోందని పేర్కొన్నారు. బంకురా నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌ షోలోనూ అమిత్‌ షా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని