భోజ్‌పురి సూపర్‌స్టార్‌ పవన్‌ సింగ్‌పై భాజపా వేటు

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రముఖ భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్‌ సింగ్‌ను పార్టీ నుంచి భాజపా బహిష్కరించింది. ఎన్డీయే అభ్యర్థిపైనే స్వతంత్రంగా పోటీకి దిగడమే అందుకు కారణం.

Published : 23 May 2024 06:02 IST

పట్నా: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రముఖ భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్‌ సింగ్‌ను పార్టీ నుంచి భాజపా బహిష్కరించింది. ఎన్డీయే అభ్యర్థిపైనే స్వతంత్రంగా పోటీకి దిగడమే అందుకు కారణం. కూటమి ఒప్పందానికి అనుగుణంగా నామినేషన్‌ వెనక్కి తీసుకోవాలని పార్టీ ఆదేశించినా.. ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తొలుత పవన్‌సింగ్‌ను భాజపా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం అసన్‌సోల్‌ స్థానం నుంచి బరిలోకి దింపింది. అదే సమయంలో అతడి పాటలపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేనంటూ వెనక్కి తగ్గారు. కొద్దిరోజుల తర్వాత అనూహ్యంగా సొంత రాష్ట్రం బిహార్‌లోని కారాకట్‌ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఎన్డీయే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని భాజపా మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌మోర్చా పార్టీకి కేటాయించింది. దాంతో ఆ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహ పోటీలో నిలిచారు. భాజపా నుంచి టికెట్‌ దక్కకపోవడంతో పవన్‌ సింగ్‌ మే 9వ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. గడువు ముగిసినా నామినేషన్‌ను వెనక్కి తీసుకోకపోవడంతో తాజాగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది. కారాకట్‌ స్థానానికి చివరి విడతలో భాగంగా జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. ఇదే నియోజకవర్గం నుంచి నటుడి తల్లి కూడా పోటీకి దిగగా.. ఆమె తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని