లోక్‌సభ పోరులో మహిళా అభ్యర్థులు 10% లోపే..

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏడు దశల్లో కలిపి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో మహిళల వాటా 10 శాతం కంటే లోపే ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) తెలిపింది. లోక్‌సభకు మొత్తం 8,360 మంది పోటీచేస్తున్నారు.

Published : 23 May 2024 06:04 IST

మొత్తం 8,337 మందిలో 797 మందే అతివలు

దిల్లీ: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏడు దశల్లో కలిపి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో మహిళల వాటా 10 శాతం కంటే లోపే ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) తెలిపింది. లోక్‌సభకు మొత్తం 8,360 మంది పోటీచేస్తున్నారు. వారిలో 8,337 మంది అభ్యర్థుల వివరాలను ఏడీఆర్‌ విశ్లేషించగా వారిలో 797 మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు వెల్లడైంది. ఇది దాదాపు 9.5 శాతానికి సమానం. కొద్దిమంది ప్రమాణపత్రాలు సరిగా స్కాన్‌ కానందున ఏడీఆర్‌ విశ్లేషించలేకపోయింది. మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత జరుగుతున్న తొలి లోక్‌సభ ఎన్నికలు ఇవే కావడం విశేషం. సుమారు 27 సంవత్సరాలపాటు పార్టీల మధ్య సంప్రదింపుల పేరుతో పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లు ఆమోదం పొందినా ఇంకా అమల్లోకి రాలేదు. ఈ బిల్లు అమల్లోకి వస్తే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో అతివలకు మూడోవంతు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల్లో లింగ వివక్షపై రాజకీయ విశ్లేషకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమల్లోకి వచ్చే వరకు పార్టీలు ఎందుకు ఆగాలని, అంతకుముందే క్రియాశీలంగా వ్యవహరించి టికెట్లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. మహిళా అభ్యర్థుల సంఖ్యను పెంచేందుకు రాజకీయ పార్టీలు గట్టి చర్యలు చేపట్టాలని దిల్లీ వర్సిటీకి చెందిన జీసస్‌ అండ్‌ మేరీ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుశీలా రామస్వామి డిమాండ్‌ చేశారు. బ్రిటన్‌ లేబర్‌ పార్టీలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో మహిళలకు స్థానాలు రిజర్వు చేయడాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. 

  • లోక్‌సభ ఎన్నికల్లో ఏడు దశల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు అందరిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లోక్‌సభ స్థానానికి తెదేపా తరఫున పోటీచేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. తనకు రూ.5,705 కోట్ల ఆస్తి ఉన్నట్లు ఆయన ప్రమాణపత్రంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనకు రూ.4,568 కోట్ల ఆస్తి ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
  • 8,337 మంది అభ్యర్థుల్లో 1,644 మంది తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. ఆ 1,644 మందిలో 1,188 మందిపై హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేష ప్రసంగాలు తదితర తీవ్రమైన అభియోగాలతో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని