బూత్‌ల వారీ డేటాతో గందరగోళమే

లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి దశ పోలింగ్‌ పూర్తయిన 48 గంటల్లోగా పోలింగ్‌ కేంద్రాలవారీగా ఓటింగ్‌ శాతాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో చేర్చాలన్న డిమాండును కేంద్ర ఎన్నికల సంఘం వ్యతిరేకించింది.

Published : 24 May 2024 03:45 IST

17సీ ప్రతులను ఇతరులకు ఇవ్వలేం 
సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం ప్రమాణపత్రం

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి దశ పోలింగ్‌ పూర్తయిన 48 గంటల్లోగా పోలింగ్‌ కేంద్రాలవారీగా ఓటింగ్‌ శాతాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో చేర్చాలన్న డిమాండును కేంద్ర ఎన్నికల సంఘం వ్యతిరేకించింది. ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్‌) చేసిన డిమాండుపై ఈ మేరకు సుప్రీంకోర్టులో 225 పేజీల ప్రమాణపత్రం దాఖలు చేసింది. పోలింగ్‌ కేంద్రాలవారీగా ఓటింగ్‌ శాతాలను బహిర్గతం చేసి వెబ్‌సైట్‌లో ప్రచురించడం వల్ల ఎన్నికల ప్రక్రియకు హాని కలుగుతుందని, యంత్రాంగం గందరగోళానికి గురవుతుందని దానిలో పేర్కొంది. పోలైన ఓట్ల సంఖ్యను తెలిపే ఫారం-17సీ ప్రతులను స్కాన్‌చేసి వెంటనే వెబ్‌సైట్‌లో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఏడీఆర్‌ కోరింది. ఇలాంటిది చట్టంలో ఎక్కడా లేదని ఈసీ తెలిపింది. పిటిషన్‌పై వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని ఈసీని ఈ నెల 17న సుప్రీంకోర్టు ఆదేశించింది. 

అవి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు 

లోక్‌సభ ఎన్నికల్లో మొదటి, రెండో దశల పోలింగ్‌ రోజున వెల్లడించిన ఓటింగ్‌ శాతం కన్నా తర్వాత విడుదల చేసినవి అయిదారు శాతం ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలను ఈసీ ఖండించింది. అవన్నీ తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. ‘పోలింగ్‌ శాతంలో 5-6% మార్పు ఉందనే ఆరోపణలు అనుమానంతో చేసినవే. పోలింగ్‌ ముగిసిన తర్వాత అందరు ఏజెంట్ల సంతకాలతో కూడిన ఫారం 17సి కాపీని పొందే అధికారం పోలింగ్‌ ఏజెంట్‌కు ఉంది. అసలైన ఫారం మాత్రం స్ట్రాంగ్‌రూంలో ఉంటుంది. మరే ఇతర సంస్థకు దానిని ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవు. పోలింగ్‌ కేంద్రాలవారీగా ఓటింగ్‌ శాతాలను బహిర్గతం చేసి వెబ్‌సైట్‌లో పెట్టడం వల్ల వాటిని మార్ఫింగ్‌ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదురై ఎన్నికల ప్రక్రియలపై విశ్వాసం పోతుంది’ అని ఈసీ పేర్కొంది. అందువల్ల పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని