ఐదో విడతలో మహిళా ఓటర్లదే పైచేయి

ప్రస్తుత సార్వత్రిక సమరం ఐదో విడతలో 62.2% పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం వెల్లడించింది.

Published : 24 May 2024 03:46 IST

దిల్లీ: ప్రస్తుత సార్వత్రిక సమరం ఐదో విడతలో 62.2% పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం వెల్లడించింది. ఈ దశలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఓటుహక్కును వినియోగించుకున్నారని తెలిపింది. ఈసీ గణాంకాల ప్రకారం- ఐదో విడతలోని మొత్తం నమోదిత మహిళా ఓటర్లలో 63% మంది ఓటు వేశారు. పురుషుల్లో అది కేవలం 61.48%గా ఉంది. ఒడిశాలో కంధమాల్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని రెండు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ పూర్తయ్యాక పోలింగ్‌ శాతం స్వల్పంగా మారే అవకాశాలు ఉన్నాయి. బిహార్, ఝార్ఖండ్‌లలో స్త్రీ, పురుష ఓటర్ల మధ్య అంతరం ఎక్కువగా కనిపించింది. బిహార్‌లో 61.58% మహిళా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోగా, పురుష ఓటర్లలో అది కేవలం 52.42%గా నమోదైంది. ఝార్ఖండ్‌ ఓటర్లలో 68.65% స్త్రీలు, 58.08% పురుషులు ఓటు వేశారు. ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 20న పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని