కొనుగోలు కేంద్రాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం: కిషన్‌రెడ్డి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.

Published : 24 May 2024 03:57 IST

రాఘవాపురంలోని కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న  కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 

బీబీనగర్, ఖమ్మం నగరం, జనగామ-న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. గత 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూకం వేయడం లేదని, దీంతో వడ్లు వర్షానికి తడిసి మొలకెత్తుతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గురువారం యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం రాఘవాపురం, రుద్రవెల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఖమ్మం నగరం, జనగామలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి రైతు సమస్యలకంటే ఎన్నికలే ముఖ్యమని ఎద్దేవా చేశారు. బోనస్‌ ఇస్తామని చెప్పి రైతులను బురిడీ కొట్టించారని, ధాన్యం మొలకెత్తడమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బోనస్సా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, భారాసలు ఒకే తాను ముక్కలు అని విమర్శించారు. భారాస అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారాసలో చేరారని, ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే భారాసలోని వారంతా కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో భారాస ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు పదేళ్లు పట్టిందని, కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు ఐదేళ్లు చాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే భారాస నిర్వీర్యమైపోయిందని, భాజపా మాత్రమే ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని తెలిపారు. డిసెంబరు 9లోపు రైతు రుణమాఫీ సహా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని సోనియా, రాహుల్‌తో కలిసి ఊరూరా తిరిగి చెప్పిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించి ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. కి¨షన్‌రెడ్డి వెంట ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని