ఈవీఎం పగలగొడుతుంటే ఈసీ ఏం చేస్తోంది?

పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం.. పాల్వాయిగేటు పోలింగ్‌ స్టేషన్‌లోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటి వరకు ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేక పోయిందని తెదేపా నేతలు ప్రశ్నించారు.

Published : 24 May 2024 04:17 IST

వెబ్‌కాస్టింగ్‌ పెట్టి ఏం ఉపయోగం?
సీఈఓను ప్రశ్నించిన తెదేపా నేతలు

సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనాకు వినతిపత్రం అందిస్తున్న వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు,
మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు 

ఈనాడు డిజిటల్, అమరావతి: పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం.. పాల్వాయిగేటు పోలింగ్‌ స్టేషన్‌లోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటి వరకు ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేక పోయిందని తెదేపా నేతలు ప్రశ్నించారు. పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్‌ పెట్టి ఏం ఉపయోగమన్నారు. ‘పోలింగ్‌ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఘటన జరిగితే పీఓ ఎందుకు ఫిర్యాదు చేయలేదు? గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని స్థానిక వీఆర్వోతో ఫిర్యాదు చేయించడం ఏంటి?’ అని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాను కలిసిన వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, మన్నవ సుబ్బారావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు... పలు అనుమానాలను ఆయన ముందుంచారు. ‘పాల్వాయిగేటు వద్ద కేంద్ర బలగాల్ని ఎందుకు మోహరించలేదు? అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు.. పిన్నెల్లిని ఎందుకు నిలువరించలేదు? ఈవీఎంను బద్దలుకొట్టిన ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సింది పోయి.. గృహ నిర్బంధంలో ఎందుకు ఉంచారు? పిన్నెల్లి సోదరులు తప్పించుకుపోవడానికి సహకరించింది ఎస్పీనా, డీఐజీనా? ఈవీఎంలు పగలగొట్టినా రిపోర్టు ఇవ్వడానికి రెండు రోజులు ఎందుకు పట్టింది?’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు. పల్నాడు సహా పలు చోట్ల చోటుచేసుకున్న హింసకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సీఈఓకు తెదేపా నేతలు వినతిపత్రం సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని