ఉద్యమ గడ్డపై పట్టెవరికి?

ఝార్ఖండ్‌లోని కీలక ప్రాంతాలైన రాజధాని సహా నాలుగు నియోజకవర్గాల్లో ఈ నెల 25వ తేదీన పోలింగ్‌ జరగనుంది. రాజధాని రాంచీ కేంద్రంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరగడం విశేషం.

Updated : 24 May 2024 06:13 IST

ఝార్ఖండ్‌లోని 4 స్థానాలకు రేపు పోలింగ్‌
బరిలో 93 మంది అభ్యర్థులు
ప్రధాన పోటీ జాతీయ కూటముల మధ్యే!
ఈనాడు ప్రత్యేక విభాగం

ఝార్ఖండ్‌లోని కీలక ప్రాంతాలైన రాజధాని సహా నాలుగు నియోజకవర్గాల్లో ఈ నెల 25వ తేదీన పోలింగ్‌ జరగనుంది. రాజధాని రాంచీ కేంద్రంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరగడం విశేషం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక అసెంబ్లీకి ఒకలా, లోక్‌సభకు మరోలా ఇక్కడ తీర్పు వెలువడుతోంది. జాతీయ స్థాయిలో హిందుత్వ, మోదీ ప్రభావం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. రాంచీ, జంశెద్‌పుర్, ధన్‌బాద్, గిరిడీహ్‌లలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం 93 మంది బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే సాగుతోంది. భాజపా కూటమిలో ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యూ) ప్రధాన భాగస్వామికాగా.. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) ఉన్నాయి. రాష్ట్రంలో ఇండియా కూటమి ప్రభుత్వమే ఉంది. 


ధనాధన్‌ ధోనీ సొంత నేల

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ సొంత ఊరు రాంచీ. దీంతోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గోండా కొండలు, బిర్సా బయోలాజికల్‌ పార్కు తదితరాలు ఉన్నాయి. ఝార్ఖండ్‌ రాజధాని అయిన రాంచీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేంద్ర స్థానంగా నిలిచింది. ఇక్కడ ఎస్టీలు 35.7 శాతం, ముస్లింలు 12.7శాతం ఉంటారు. 

2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా తరఫున సంజయ్‌ సేథ్, కాంగ్రెస్‌ నుంచి యశస్వినీ సహాయ్, బీఎస్పీ తరఫున మనోజ్‌ కుమార్‌ పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో భాజపా గెలిచినా ఈ సారి గట్టి పోటీ నెలకొంది. మోదీ, రామ మందిరంపై భాజపా ఆధారపడుతోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొన్న జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేయడంతో కొంత సానుభూతి రావొచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో అధికారంలో ఉండటం ఆ కూటమికి కలిసివచ్చే అంశం.


టాటా నగరం

పార్శీ వ్యాపారవేత్త జంశెద్‌జీ నషార్వాంజీ టాటా పేరుతో ఏర్పాటైన జంశెద్‌పుర్‌ను టాటా నగర్‌ అని కూడా పిలుస్తారు. ఇది పారిశ్రామిక నగరంగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. 1907లో తొలిసారిగా ఇక్కడ టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (టిస్కో) ఏర్పాటైంది. ఆ తర్వాత టాటాకు చెందిన అనేక కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ ఎస్టీలు 28.5%, ముస్లింలు 8.9%, ఎస్సీలు 5% ఉన్నారు. 

2014, 2019లలో ఇక్కడి నుంచి భాజపా నేత బిద్యుత్‌ బరన్‌ మహతో గెలిచారు. హ్యాట్రిక్‌ సాధించేందుకు మరోసారి ఆయనే పోటీ చేస్తున్నారు. జేఎంఎం తరఫున సమీర్‌ కుమార్‌ మొహంతి, బీఎస్పీ తరఫున ప్రణవ్‌ కుమార్‌ మహతో తలపడుతున్నారు. మోదీ ప్రభావంతోపాటు బిద్యుత్‌కు స్థానికంగా ఉన్న బలం భాజపాకు సానుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్, జేఎంఎంల ఓట్ల బదిలీ సాఫీగా సాగితే ఇండియా కూటమి గట్టెక్కే అవకాశాలూ లేకపోలేదు. 


జైనుల పవిత్ర స్థలం

జైనుల పవిత్ర స్థలం గిరిడీహ్‌లోనే ఉంది. ఇక్కడి పార్శ్వనాథ్‌ ఆలయానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. రాజకీయంగానూ ఈ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానముంది. బొగ్గు, ఇనుప ఖనిజ ఆధారిత పరిశ్రమలు కూడా అధికంగానే ఉన్నాయి. అయినా నిరుద్యోగం, వలసలే ఇక్కడ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కుర్మీలు 18%, ముస్లింలు 16.2%, ఎస్సీలు 14.7%, ఎస్టీలు 10.2% ఉన్నారు. 

2014లో భాజపా, 2019లో ఏజేఎస్‌యూ ఇక్కడ విజయం సాధించాయి. ఈసారి ఏజేఎస్‌యూ తరఫున మరోసారి చంద్ర ప్రకాశ్‌ చౌధరి, జేఎంఎం నుంచి మధుర ప్రసాద్‌ మహతో, బీఎస్పీ తరఫున కమల్‌ ప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. ప్రధాన కూటముల అభ్యర్థులిద్దరినీ ఝార్ఖండీ భాషా ఖత్లాన్‌ సంఘర్ష్‌ సమితి నేత జైరాం మహతో సవాలు చేస్తున్నారు. వీరంతా కుర్మీ నేతలే కావడంతో వారి ఓట్లు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీయే కోటను బద్దలు కొడతానని మధుర ప్రసాద్‌ అంటున్నారు. మరోవైపు జైరాం ర్యాలీలకు భారీగా జనం హాజరవుతున్నారు. యువనేతగా ఈ ప్రాంతంలో ఆయన పట్టు సాధించారు. దీంతో ముక్కోణపు పోటీలో విజేత ఎవరనేది జూన్‌ 4 న తేలనుంది. 


బొగ్గు గనుల రాజధాని

దేశ బొగ్గు గనుల రాజధానిగా ధన్‌బాద్‌కు పేరు. ఈ ప్రాంతంలో అనేక బొగ్గు గనుల పరిశ్రమలున్నాయి. దీంతోపాటు భారీ పరిశ్రమలకు, వాణిజ్యానికి కేంద్రంగా నిలుస్తోంది. ధన్‌బాద్‌ చుట్టూ 112 బొగ్గు గనులున్నాయి. 2.75 కోట్ల టన్నుల బొగ్గును ఇవి ఏటా ఉత్పత్తి చేస్తాయి. దామోదర్, జామురియా నదులు ఇక్కడ ప్రవహిస్తాయి. ఇక్కడ 65శాతం పట్టణ ప్రాంత ఓటర్లుంటారు. ఎస్సీలు 16%, ఎస్టీలు 8%, ముస్లింలు 14% ఉంటారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చి గనుల్లో పనిచేసేవారు అధికంగా ఉంటారు. 

2014, 2019లలో మోదీ ప్రభంజనం కారణంగా భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా తరఫున దులు మహతో, కాంగ్రెస్‌ నుంచి అనుపమా సింగ్, బీఎస్పీ నుంచి మోహన్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు. మరోసారి మోదీ, రామ మందిరం ప్రభావంతో గెలవాలని భాజపా చూస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని