సంక్షిప్త వార్తలు (10)

భారాసకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తెలిపారు.

Updated : 25 May 2024 06:46 IST

కాంగ్రెస్‌కు కిషన్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌: జగ్గారెడ్డి

హైదరాబాద్, న్యూస్‌టుడే: భారాసకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు కిషన్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని, భాజపాలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారని భావిస్తున్నామన్నారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో భాజపా నేతలు ప్రొఫెసర్లు కానీ, రాష్ట్రంలో ఎన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వాన్ని పడగొట్టలేరని స్పష్టం చేశారు.


ముస్లిం రిజర్వేషన్లపై తప్పుడు ప్రకటనలు చేస్తే పిటిషన్‌ వేస్తా: షబ్బీర్‌ అలీ

హైదరాబాద్, న్యూస్‌టుడే: ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీమంత్రి షబ్బీర్‌అలీ విమర్శించారు. రిజర్వేషన్లపై తప్పుడు ప్రకటనలు చేస్తే సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌ వేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, దీనిపై మోదీ, అమిత్‌షా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఈ లేఖలోని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత మోదీ వైఖరిలో మార్పు వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు.


తీన్మార్‌ మల్లన్నకు సీపీఎస్‌ సంఘం మద్దతు 

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్‌ శ్రీకాంత్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు పేర్కొన్నారు.


భారాస నేతలనే అలా అన్నాను: మంత్రి తుమ్మల

 ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సమావేశాల సందర్భంగా రైతులను విమర్శించారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  రైతులను తాము దేవుళ్లుగా భావిస్తున్నామన్నారు. అన్నదాతలకు అన్ని విధాలు మేలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై భారాస నేతలు మొరుగుతున్నారని తాను ఖమ్మం జిల్లా సభల్లో విమర్శించానని మంత్రి స్పష్టం చేశారు.


మహేశ్వర్‌రెడ్డిపై కేసులు అన్యాయం: భాజపా 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను భాజపా శాసనసభాపక్ష నేతగా మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని భాజపా ఎమ్మెల్యేలు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఆధారాలతో అక్రమాలను బయటపెడితే సమాధానం చెప్పకుండా కేసులు పెట్టించడం దారుణమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్, రామారావు పాటిల్, పాల్వాయి హరీశ్‌బాబు, ధన్‌పాల్‌ సూర్యనారాయణలు పేర్కొన్నారు. ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టడం కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.


వైకాపా హయాంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: వైకాపా హయాంలో పోలీసు వ్యవస్థ  నిర్వీర్యంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. తిరుపతిలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘స్థానిక పద్మావతి యూనివర్సిటీ ఆవరణలో చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై  జరిగిన హత్యాయత్నానికి పోలీసుల వైఫల్యమే కారణం. శాంతిభద్రతలను కాపాడలేని పోలీసులు యూనిఫాం ధరించేందుకు అనర్హులు. పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోవడంలోనూ ఖాకీల పాత్ర ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఈసీ విఫలమైంది. ఓటేసేందుకు డబ్బులు ఇవ్వాలంటూ కొన్నిచోట్ల ప్రజలు బహిరంగంగా ధర్నాకు దిగడం హాస్యాస్పదం’ అని రామకృష్ణ పేర్కొన్నారు.


విజయం కూటమిదే: పురందేశ్వరి 

ఈనాడు-అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించబోతున్నట్లు పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. వెబ్‌ మాధ్యమం ద్వారా శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో మాదిరిగానే కౌంటింగ్‌ ప్రక్రియలోనూ అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.


బ్రిటిషర్ల తరహాలో మోదీ సర్కారు దోపిడీ 

బ్రిటిషర్ల తరహాలో మోదీ సర్కారు మన దేశ జలాలు, అడవులు, భూములను గత పదేళ్లు దోచుకుంది. భారత సంపదను ధనవంతులైన తన స్నేహితులకు ప్రధాని అప్పగించారు. మేం బ్రిటిషర్లను ఎదుర్కొన్నవాళ్లం. భాజపాకు భయపడం. కాంగ్రెస్‌ ఎప్పుడూ హిందువులు, ముస్లింలను ఏకం చేస్తుంటుంది. మోదీ మాత్రం వారిని విడగొడుతుంటారు. 

మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అధ్యక్షుడు (ఝార్ఖండ్‌ లోని దేవ్‌ ఘర్‌ లో ర్యాలీలో..)


ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ఇండియా కూటమితో ముప్పు

విపక్ష ఇండియా కూటమి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, అత్యంత వెనుకబడినవర్గాల ప్రజలకు వ్యతిరేకం. ఈ వర్గాల రిజర్వేషన్‌ ను లాగేసుకొని ముస్లింలకు కేటాయించాలని ఆ కూటమి భావిస్తోంది. తద్వారా ముస్లింలను సంతృప్తిపరచాలని చూస్తోంది. దానికి ఓటు వేయొద్దు. భాజపాకు మద్దతుగా నిలవండి. మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితే.. భారత్‌  ప్రపంచంలోకెల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది.

జె.పి.నడ్డా, భాజపా అధ్యక్షుడు (ఉత్తర్‌ప్రదేశ్‌ లోని కుశినగర్‌ లో మాట్లాడుతూ..) 


అసత్యాలు ప్రచారం చేయడానికి దేవుడు భూమిపైకి పంపిస్తాడా?

తనను దేవుడే భూమిపైకి పంపించాడని, తనకు జీవ సంబంధిత తల్లిదండ్రులు లేరని మోదీ అంటున్నారు. నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నా. అల్లర్లు సృష్టించడానికి, ప్రచార ప్రకటనలతో అసత్యాలు వ్యాప్తి చేయడానికి, ఎన్నార్సీ ద్వారా ప్రజలను జైలుపాలు చేయడానికి దేవుడు ఎవరినైనా భూమిపైకి పంపిస్తాడా? ఎన్నికల్లో ఓటమి భయం కారణంగా భాజపా నేతలు నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. 

మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం (బెంగాల్‌లోని మథురాపూర్‌లో ప్రసంగిస్తూ..) 


పూర్తి ఆరోగ్యంగా ఉన్నా

నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా. కొన్ని నెలలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా. నేను అనారోగ్యంగా ఉన్నట్లు భాజపా చెబుతుతోంది. ఆ పార్టీ నేతల అబద్ధాలకు ఓ హద్దు ఉండాలి. 

నవీన్‌  పట్నాయక్‌ , ఒడిశా సీఎం (భువనేశ్వర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ..)


బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసుల సమస్యలు పరిష్కరించండి

డీజీపీకి తెదేపా నేతలు ఇక్బాల్, ఎంఎస్‌ బేగ్‌ వినతి

పోలీసుల సమస్యలు పరిష్కరించాలని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు వినతిపత్రం అందజేస్తున్న తెదేపా నాయకులు మహ్మద్‌ ఇక్బాల్, ఎంఎస్‌ బేగ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికలకు సంబంధించి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసుల సమస్యల్ని పరిష్కరించాలని డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తాకు తెదేపా నేతలు మహ్మద్‌ ఇక్బాల్, ఎంఎస్‌ బేగ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో శుక్రవారం డీజీపీకి   వినతిపత్రం అందజేశారు. ‘అలవెన్సులు సకాలంలో అందించాలి. మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’ అని కోరారు.


పిన్నెల్లి అరాచకాలకు గిరిజనులు బలి
తెదేపా ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధారునాయక్‌ 

ఈనాడు డిజిటల్, అమరావతి: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు గిరిజనులు బలయ్యారని తెదేపా ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధారునాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్‌ రోజు కొత్తపుల్లారెడ్డిగూడెంలోని 8 మంది గిరిజన ఏజెంట్లపై పిన్నెల్లి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారని శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మూడు పోలింగ్‌ బూత్‌లలో ఏజెంట్లుగా కూర్చున్న గిరిజనులపై కర్రలు, కత్తులు, రాడ్లతో దాడి చేశారు. కేతావత్‌ రేఖ్యానాయక్‌ కడుపులో పొడవడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని