కౌంటింగ్‌ సమయంలో వైకాపా అరాచకానికి పాల్పడొచ్చు

ఓట్ల లెక్కింపు సమయంలో వైకాపా అలజడి సృష్టించి, అరాచకానికి పాల్పడే అవకాశం ఉందని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో ఒక విధంగా ప్రక్రియను అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నాలు చేస్తోందన్నారు.

Updated : 25 May 2024 06:40 IST

ఎన్నికల అధికారులకు తెదేపా నేతల ఫిర్యాదు 

ఈనాడు, అమరావతి: ఓట్ల లెక్కింపు సమయంలో వైకాపా అలజడి సృష్టించి, అరాచకానికి పాల్పడే అవకాశం ఉందని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో ఒక విధంగా ప్రక్రియను అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెదేపా కౌంటింగ్‌ ఏజెంట్లను కిడ్నాప్‌ చేసేలా వ్యూహాలు పన్నుతున్నారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. పోలింగ్‌ రోజు చోటుచేసుకున్న పరిణామాలపై శుక్రవారం.. సచివాలయంలోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డిలు విలేకర్లతో శుక్రవారం మాట్లాడారు.

‘సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఆయన మాటలతో వైకాపా కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్‌ బూత్‌ను ఆక్రమించి, ఈవీఎం పగలకొడితే ఆ రోజే ఎందుకు ఫిర్యాదు చేయలేదని సజ్జల అంటున్నారు. ఆ రోజే మేం ఫిర్యాదు చేశాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టిన ఈవీఎం వీవీప్యాట్‌ నుంచి బయటపడిన స్లిప్పుల్లో మెజారిటీ తెదేపాకు మద్దతుగా ఉన్నాయి. మాచర్ల ప్రజల్లో నిశ్శబ్ద విప్లవానికి ఇది నిదర్శనం. ఇదే తీరులో రాష్ట్రం అంతటా ప్రజలు వైకాపాకు బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నారు. పిన్నెల్లిపై అప్పుడే కేసు నమోదు చేసి ఉంటే.. హైకోర్టులో నిన్న రక్షణ దొరికేదా? పోలీసులు ఏపీ పోలీసు మాన్యువల్‌ ప్రకారమే నడుచుకుంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు సహకరించండి. పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల లెక్కింపు కోసం 500 ఓట్లకో టేబుల్‌ ఏర్పాటు చేయాలి. అధికారుల తప్పిదాల వల్ల ఓట్లు చెల్లకుండా చేయొద్దని గత వారం సీఈఓ దృష్టికి తీసుకెళ్లాం. లెక్కింపు ప్రక్రియ ఎలా నిర్వహిస్తారో రాజకీయ పార్టీలకు తెలియజేయాలని కోరాం. దీనిపై అన్ని పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరగాలంటే సీఎస్‌ జవహర్‌రెడ్డిని తక్షణమే పదవి నుంచి తప్పించాలి’ అని పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ  పరిధిలోని నల్లమాడ మండలం నరసింగయ్యగారిపల్లి పోలింగ్‌ బూత్‌లోకి వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి వెళ్లి తెదేపా ఏజెంట్‌ను బెదిరించారని, అది తెలిసి అక్కడికి వెళ్లిన తెదేపా అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిపై దాడి చేశారని చెప్పారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని తెదేపా నేతలు మండిపడ్డారు.

31 బూత్‌లలో రీపోలింగ్‌ కోరాం: వర్ల రామయ్య  

మాచర్లలో నాలుగు పోలింగ్‌ బూత్‌లు, సత్తెనపల్లిలో ఆరు, దర్శి, ఒంగోలులో అయిదేసి చొప్పున ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 బూత్‌లలో రీపోలింగ్‌ జరపాలని గతంలోనే ఎన్నికల సంఘాన్ని(ఈసీ) కోరినట్లు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. తెదేపా రీపోలింగ్‌ కోరలేదంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని