తెదేపా నాయకులపై వైకాపా మూక దాడి

తాగునీటి విషయంలో తెదేపా నాయకులపై వైకాపా మూకలు దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం సిద్ధాపురం తండాలో చోటుచేసుకుంది. గ్రామంలో 2018లో ఓ పరిశ్రమ యాజమాన్యం శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

Updated : 25 May 2024 06:35 IST

ఆరుగురికి గాయాలు - తాగునీటి విషయంలో ఘర్షణ

గవిసిద్ధనాయక్‌ తలకు కుట్లు వేస్తున్న వైద్యసిబ్బంది

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: తాగునీటి విషయంలో తెదేపా నాయకులపై వైకాపా మూకలు దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం సిద్ధాపురం తండాలో చోటుచేసుకుంది. గ్రామంలో 2018లో ఓ పరిశ్రమ యాజమాన్యం శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని వైకాపా నాయకుడు శివనాయక్, భార్య రూపాబాయి నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి తెదేపా మద్దతుదారు దేవిబాయి నీళ్లు తెచ్చుకునేందుకు ప్లాంటు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో రూపాబాయి ఒక్కసారిగా దేవిబాయిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీకు ఈ రోజు నుంచి నీటిని వదలబోమని చెప్పారు. ఎందుకు ఇవ్వరని దేవిబాయి ప్రశ్నించడంతో కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం దేవిబాయి ఇంటికి వెళ్తుండగా ఆమెపై వైకాపా మద్దతుదారు పారుబాయి దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు గవిసిద్ధనాయక్, గవిసిద్ధ, సుశీలబాయి, జానకీబాయి, సంతోశ్‌నాయక్‌ తదితరులు అక్కడికి చేరుకుని ఎందుకు నీళ్లివ్వరని ప్రశ్నించారు. ఈ క్రమంలో మాట మాట పెరిగి వైకాపా నాయకులు శివనాయక్, రాజేశ్‌నాయక్, వెంకటేశ్‌నాయక్, తిప్పేస్వామినాయక్‌ మూకుమ్మడిగా తెదేపా నేతలపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో తెదేపాకు చెందిన ఆరుగురికి గాయాలు కాగా బళ్లారిలో చికిత్స పొందారు. గవిసిద్ధనాయక్‌ తలకు ఏడు కుట్లు పడ్డాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని