గిరిజనం ఎటంటే అటే!

పశ్చిమ బెంగాల్‌లో గిరిజనుల ఆధిపత్యమున్న ప్రాంతంలోని 8 నియోజకవర్గాల్లో శనివారం ఆరో విడతలో భాగంగా పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల్లో ఇక్కడ పైచేయి సాధించిన భాజపా మరోసారి పట్టుకు ప్రయత్నిస్తోంది.

Updated : 25 May 2024 05:48 IST

పశ్చిమ బెంగాల్‌ ఆరో విడతలో 8 నియోజకవర్గాల్లో నేడే పోలింగ్‌
గత ఎన్నికల్లో 5 గెలిచిన భాజపా
మళ్లీ పట్టుకు ప్రయత్నం
అడ్డుకోవాలని తృణమూల్‌ పోరాటం

పశ్చిమ బెంగాల్‌లో గిరిజనుల ఆధిపత్యమున్న ప్రాంతంలోని 8 నియోజకవర్గాల్లో శనివారం ఆరో విడతలో భాగంగా పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల్లో ఇక్కడ పైచేయి సాధించిన భాజపా మరోసారి పట్టుకు ప్రయత్నిస్తోంది. 2019లో ఈ 8లో ఐదింటిని భాజపా గెలుచుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ 3 చోట్ల విజయం సాధించింది. మళ్లీ తమదే ఆధిపత్యమని భాజపా అంటుండగా.. ఈసారి పరిస్థితుల్లో మార్పు వచ్చిందని తృణమూల్‌ చెబుతోంది. 8 నియోజకవర్గాల్లో మొత్తం 79 మంది పోటీ చేస్తున్నారు. భాజపా, తృణమూల్‌ల మధ్యే  ప్రధాన పోటీ నెలకొంది. ఇండియా కూటమీ బరిలో ఉంది.

  • ఝార్ఖండ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న కొన్ని నియోజకవర్గాలు ఒకప్పుడు నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి.
  • ముండా వర్గానికి చెందిన గిరిజనులు పురూలియా, మేదినీపుర్‌లలో ఉంటారు.
  • బాంకుఢా, పురూలియా, మేదినీపుర్‌ నియోజకవర్గాల్లో సంతాల్‌ గిరిజనులు అధికంగా ఉంటారు.
  • పురూలియా మైదాన ప్రాంతాల్లో ఓరాన్‌ (కురుఖ్‌) గిరిజనులు ఉంటారు.

హ్యూయాన్‌ త్సాంగ్‌ దర్శించిన స్థలం

చైనా పర్యాటకుడు హ్యూయాన్‌ త్సాంగ్‌ సందర్శించిన స్థలమే తామ్లుక్‌. గతంలో దీనిని తామ్రలిప్తి అని పిలిచేవారు. బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్న ఈ నియోజకవర్గం రూప్‌నారాయణ్‌ నదీ తీరాన ఉంది. గతంలో కాంగ్రెస్, లెఫ్ట్‌ ఆధిపత్యం చెలాయించిన ఈ సీట్లో ప్రస్తుతం తృణమూల్‌ హవా కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 15శాతం ఉంటారు.

2014, 2019లలో తృణమూల్‌ ఇక్కడ విజయం సాధించింది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి అభిజీత్‌ గంగోపాధ్యాయ ఈసారి భాజపా తరఫున, యువనేత దేబాంశు భట్టాచార్య తృణమూల్‌ నుంచి, సయాన్‌ బెనర్జీ సీపీఎం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ తృణమూల్‌ అంతకంతకూ బలపడుతోంది. 2016 ఉప ఎన్నికలో వామపక్షం 5 లక్షల ఓట్లను సాధించింది. ఆ తర్వాత క్రమంగా పట్టు కోల్పోతోంది. తృణమూల్‌ నుంచి భాజపాలో చేరిన సువేందు అధికారి కుటుంబానికి ఈ ప్రాంతంలో గట్టి పట్టుంది.


సైద్ధాంతిక పోరుకు వేదిక

కంగస్‌బాతీ నదీతీరాన ఉన్న మేదినీపుర్‌ రాజకీయ సైద్దాంతిక పోరుకు వేదిక. లెఫ్ట్‌ దిగ్గజ నేత ఇంద్రజిత్‌ గుప్తా ఇక్కడి నుంచే ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. విద్యా కేంద్రమైన మేదినీపుర్‌లో అక్షరాస్యత అధికం. బెంగాలీ, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, మార్వాడీ మాట్లాడతారు.  

లెఫ్ట్‌నకు ఆధిపత్యం ఉన్న ఈ సీట్లో 2014లో తృణమూల్, 2019లో భాజపా గెలిచాయి. ఈసారి అగ్నిమిత్ర పాల్‌ (భాజపా), జూన్‌ మలియా (తృణమూల్‌), బిప్లవ్‌ భట్టా (సీపీఐ) పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన దిలీప్‌ ఘోష్‌ను బర్ధమాన్‌ దుర్గాపుర్‌కు భాజపా మార్చింది. అగ్నిమిత్ర ఫ్యాషన్‌ డిజైనర్‌కాగా.. జూన్‌ మలియా నటి. మరోసారి విజయం సాధించేందుకు భాజపా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మోదీ ప్రభావం అధికంగా పనిచేసే అవకాశముంది.


ఫార్వర్డ్‌బ్లాక్‌ కంచుకోట

ఒకప్పటి ఫార్వర్డ్‌ బ్లాక్‌కు కంచుకోట పురూలియా. కసల్‌ నదీతీరాన ఈ నియోజకవర్గం ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ ఒకసారి గెలవగా.. సీపీఎం అడుగుపెట్టలేదు. పూరూలియాలో అక్షరాస్యత 65%.

2014లో తృణమూల్, 2019లో భాజపా ఇక్కడ విజయం సాధించాయి. ఈసారి భాజపా తరఫున సిటింగ్‌ ఎంపీ జ్యోతిర్మయి సింగ్‌ మహతో, తృణమూల్‌ నుంచి రాష్ట్ర మంత్రి శాంతిరాం మహతో, కాంగ్రెస్‌ అభ్యర్థిగా నేపాల్‌ చంద్ర మహతో బరిలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో భాజపా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. దీంతో మరోసారి గెలుస్తామనే ధీమాతో ఉంది.


వ్యవసాయాధారితం

కోల్‌కతాకు 160 కిలోమీటర్ల దూరంలో ఉండే కాంథీ నియోజకవర్గంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఉప్పు ఉత్పత్తి అధికంగా జరుగుతూ ఉంటుంది. అత్యంత వెనుకబడిన జిల్లాలో ఇది ఒకటి. 2008లో ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచీ తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలుస్తూ వస్తోంది.

ఈసారి భాజపా నుంచి సౌమేందు అధికారి, తృణమూల్‌ నుంచి ఉత్తమ్‌ బారిక్, కాంగ్రెస్‌ నుంచి ఊర్వశి బెనర్జీ తలపడుతున్నారు. ఈ ప్రాంతంలో పట్టున్న అధికారి కుటుంబం దూరం కావడం తృణమూల్‌కు ప్రతికూలం.


ఘన చరిత్ర

ఘన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం కలిగిన ఘాటాల్‌ 2008లో నియోజక వర్గాల పునర్విభజన తర్వాత ఏర్పాటైంది. ఇక్కడ ఖాదీ ఉత్పత్తులు, టస్సర్‌ సిల్క్, బెల్‌ల తయారీ పరిశ్రమలున్నాయి. 

2014, 2019లలో తృణమూల్‌ విజయం సాధించింది. ఈసారి భాజపా తరఫున హిరణ్మయ్‌ ఛటోపాధ్యాయ, తృణమూల్‌ నుంచి దీపక్‌ అధికారి, సీపీఐ నుంచి తపన్‌ గంగూలీ పోటీ చేస్తున్నారు. దీపక్‌ బెంగాలీ సినీ నటుడు. కరోనా సమయంలో ఆయన నియోజకవర్గంలో ప్రజలకు విస్తృత సేవలందించారు. దీంతో మళ్లీ ఆయనకే మమత టికెటిచ్చారు. హిరణ్మయ్‌ కూడా సినీ నటులే కావడం గమనార్హం. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది.


బెంగాలీ హిందూ సొసైటీ

బెంగాలీ హిందూ సొసైటీకి ప్రాతినిధ్యం వహించే ఝాఢ్‌గ్రామ్‌ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వు అయింది. బెంగాల్‌లో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో వ్యవసాయమే జీవనాధారం. అయితే ఇక్కడ అక్షరాస్యత 80శాతం ఉండటం విశేషం. 94శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఉంటారు. ఎస్టీలు 25.7%, ఎస్సీలు 18.2% ఉంటారు.

2014లో తృణమూల్, 2019లో భాజపా ఇక్కడ గెలిచాయి. ఈసారి భాజపా నుంచి ప్రణత్‌ టుడు, తృణమూల్‌ నుంచి కాళీపాద సరెన్, సీపీఎం తరఫున సోనామణి టుడు బరిలోకి దిగారు. గత ఎన్నికల నుంచి భాజపా పట్టు సాధించడంతో మరోసారి గెలుస్తామన్న ధీమా ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.


సంగీత ఝరి

పెయింటింగ్స్, సంగీతానికి కేంద్ర స్థానం బాంకుఢా. ఆధునిక బెంగాలీ కళకు, నిర్మాణ శైలికి ఇది అద్దం పడుతుంది. పర్యాటకులూ భారీగా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అక్షరాస్యత 86శాతం.

2014లో తృణమూల్, 2019లో భాజపా గెలిచాయి. ఈసారి భాజపా నుంచి మరోసారి కేంద్ర మంత్రి సుభాష్‌ సర్కార్‌ బరిలో దిగారు.  అరూప్‌ చక్రవర్తి (తృణమూల్‌), నీలాంజన్‌ దాస్‌గుప్తా (సీపీఎం) పోటీలో ఉన్నారు. ఇక్కడా భాజపా ఆధిపత్యమే కనిపిస్తోంది. తృణమూల్‌ ఎంతమేరకు పోటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


ఆలయాలకు నిలయం

టెర్రాకోటా మట్టితో నిర్మించిన మధ్యయుగంనాటి ఆలయాలకు బిష్ణుపుర్‌ ప్రసిద్ధి. ఎస్సీలకు రిజర్వు చేసిన ఈ నియోజకవర్గంలో అలనాటి నిర్మాణ శైలులు ఎన్నో కనిపిస్తాయి. 

2014లో తృణమూల్, 2019లో భాజపా విజయం సాధించాయి. ఈ రెండుసార్లూ రెండు పార్టీల తరఫున సౌమిత్రా ఖాన్‌ గెలిచారు. ఆయనే మరోసారి భాజపా తరఫున బరిలో నిలిచారు. తృణమూల్‌ నుంచి సుజాతా మండల్, సీపీఎం అభ్యర్థిగా శీతల్‌ చంద్ర పోటీ చేస్తున్నారు. సౌమిత్రా ఖాన్‌కు స్థానికంగా ఉన్న బలం, మోదీ ప్రభావంతో గెలుస్తామని భాజపా భావిస్తోంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని