విపక్షాల గాలి బుడగ పేలిపోయింది

ఇండియా కూటమి గాలి బుడగ పేలిపోయిందని, వారికి ఓటు వేయాలని ఎవరూ కోరుకోవడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 25 May 2024 05:51 IST

తిహాడ్‌ జైలుకు ఫైళ్లు పట్టుకుపోయిన భగవంత్‌ మాన్‌
పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్‌ సభల్లో ప్రధాని మోదీ

జలంధర్, గురుదాస్‌పుర్‌/శిమ్లా, నాహన్‌: ఇండియా కూటమి గాలి బుడగ పేలిపోయిందని, వారికి ఓటు వేయాలని ఎవరూ కోరుకోవడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్‌ సభల్లో మోదీ విపక్షాలపై తన పదునైన దాడిని కొనసాగించారు. పంజాబ్‌లోని జలంధర్, గురుదాస్‌పుర్‌ ర్యాలీల్లో ఆయన మాట్లాడుతూ.. జలంధర్‌ కూడలిలో నిలబడి ఎవరిని అడిగినా వందకు 90 మంది మళ్లీ మోదీ సర్కారే అని చెబుతారన్నారు. మన సరిహద్దుకు చేరువగా ఉన్న కర్తార్‌పుర్‌ సాహిబ్‌ను దేశ విభజన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ పాకిస్థాన్‌కు అప్పగించిందని విమర్శించారు. 1984లో జరిగిన సిక్కుల ఊచకోత దాడులకు సంబంధించి కాంగ్రెస్‌ నిందితులను కాపాడాలని చూడగా, తమ ప్రభుత్వం వారికి శిక్ష పడేలా చేసిందన్నారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోరని, ప్రతి పనికి దస్త్రాలు పట్టుకొని తన ‘మాలిక్‌’ (కేజ్రీవాల్‌ను ఉద్దేశించి) ఉన్న తిహాడ్‌ జైలుకు వెళ్లడం ఆయనకు అలవాటైపోయిందన్నారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) తీసుకురావాలని తాము ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ దానిని వ్యతిరేకిస్తూ ముస్లిం పర్సనల్‌ లా ‘షరియత్‌’కు మద్దతు పలుకుతోందని మోదీ తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పోరాడిన తొలి వ్యక్తి సిక్కు వర్గీయుడే అని చెప్పారు. 

హిమాచల్‌లో తాళాలు వేసే సర్కారు 

హిమాచల్‌లోని మండీతోపాటు సిర్‌మౌర్‌ జిల్లా నాహన్‌ సభల్లో మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తాళాలు వేసే సర్కారు (తాలాబాజ్‌)గా అభివర్ణించారు. రాష్ట్రంలో స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (హెచ్‌పీఎస్‌ఎస్‌సీ)కు తాళం వేసిన కాంగ్రెస్‌ పార్టీ ఇపుడు అయోధ్య రామమందిరానికి కూడా తాళం వేయాలని చూస్తోందని ఆరోపించారు. గతేడాది రాష్ట్రంలో వచ్చిన వరదలకు కేంద్రం అందించిన సాయాన్ని ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే పంపిణీ చేశారని, మళ్లీ అధికారంలోకి రాగానే అవకతవకల లెక్కలన్నీ బయటకు తీస్తామన్నారు. సిర్‌మౌర్‌ జిల్లాలోని ట్రాన్స్‌ గిరీ ప్రాంతానికి చెందిన 2.50 లక్షల హట్టీ తెగ జనులకు కేంద్రం గిరిజన హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసిన మోదీ.. లబ్ధిదారులకు ఆ ప్రయోజనాలను అందించడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారు విఫలమైందని దుయ్యబట్టారు. మండీ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్‌ను రాష్ట్రంలోని యువత ఆకాంక్షలకు ప్రతీకగా ప్రధాని పేర్కొన్నారు. ఆమెను కించపరిచేలా ప్రకటనలు చేసిన కాంగ్రెస్‌ నాయకులకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ సర్కారు భయంతో టిబెట్‌ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా పేరు కూడా తలచేది కాదని, తాను ఆయనతో తరచూ చర్చలు జరిపానన్నారు. భారత్‌ బుద్ధుడి దేశమని, ఘనమైన ఆ సంస్కృతిని చాటుతున్న దిగ్గజంగా దలైలామాను మోదీ అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని