ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేం

అయిదు దశల పోలింగ్‌ ముగిసి మరో రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓటింగ్‌ శాతాల వెల్లడిపై ఎన్నికల సంఘానికి (ఈసీ) ఆదేశాలు జారీ చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Updated : 25 May 2024 05:40 IST

పోలింగ్‌ పూర్తైన 48 గంటల్లోగా ఓటింగ్‌ శాతాల వెల్లడిపై సుప్రీంకోర్టు

దిల్లీ: అయిదు దశల పోలింగ్‌ ముగిసి మరో రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓటింగ్‌ శాతాల వెల్లడిపై ఎన్నికల సంఘానికి (ఈసీ) ఆదేశాలు జారీ చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలింగ్‌ పూర్తయిన 48 గంటల్లోగా ప్రతి పోలింగ్‌ కేంద్రం వారీగా ఓటింగ్‌ శాతాలను ఈసీ వెబ్‌సైట్‌లో ఉంచాలని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) కోరుతోంది.  దీనిపై 2019లోనే ఏడీఆర్‌ ప్రధాన పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా వేసిన మధ్యంతర పిటిషన్‌పై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన సెలవు కాలీన ధర్మాసనం విచారణ జరిపింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మరో రెండు దశలే మిగిలి ఉన్నందున ప్రస్తుతానికి ఈసీని అలా ఆదేశించలేమని శుక్రవారం తెలిపింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ అంశంపై సాధారణ ధర్మాసనం విచారణ జరుపుతుందని స్పష్టంచేసింది. ఏడీఆర్‌ పిటిషన్‌ను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది. ఓటింగ్‌ శాతాలను సవివరంగా ప్రచురించేందుకు ఈసీ భారీస్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఏడీఆర్‌ పిటిషన్‌పై వారం రోజుల్లోగా స్పందన తెలియజేయాలని ఈ నెల 17న ఈసీని ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్‌ డిమాండును వ్యతిరేకించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అలా సమాచారం ప్రచురిస్తే ఎన్నికల ప్రక్రియకు హాని కలుగుతుందని వివరణ ఇచ్చింది. 

 ఓటింగ్‌ శాతం యాప్‌ కష్టాన్ని కోరి తెచ్చుకోవడమే!

శుక్రవారం విచారణ సందర్భంగా ధర్మాసనం...ఈసీ రూపొందించిన ‘ఓటింగ్‌ శాతాన్ని తెలిపే యాప్‌’ గురించి ప్రస్తావించింది. రాష్ట్రాల వారీగా ఎప్పటికప్పుడు పోలింగ్‌ శాతాన్ని తెలిపే ఈ యాప్‌ను తీసుకురావాల్సి చట్టపరమైన బాధ్యత ఈసీకి లేదని, అయినప్పటికీ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని తీసుకొచ్చిందని ధర్మాసనం తెలిపింది. నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతాన్ని తెలుసుకునేందుకూ ఉపయోగపడేలా చేయటం ‘కష్టాన్ని కోరి తెచ్చుకోవడమే’నంటూ ఓ సామెతను ధర్మాసనం ఉదహరించింది.

అక్రమాలెలా సాధ్యం:ఈసీ

పోలింగ్‌ పూర్తయిన తర్వాత ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ ఫారం-17సీని నలుగురు ఏజెంట్లకు ఇస్తారని, అందులో అక్కడ నమోదైన ఓటింగ్‌ శాతం ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఫారం-17సీ ఏజెంట్ల వద్ద, ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఉంటే ఇక అక్రమాలకు తావెక్కడిదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని