వైద్య విద్యార్థులు నష్టపోకుండా చూడాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు

విభజన చట్టం కాల పరిమితి వచ్చే నెల 2వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో పాత మెడికల్‌ కళాశాలల్లో వంద శాతం కన్వీనర్‌ కోటా సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 26 May 2024 04:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: విభజన చట్టం కాల పరిమితి వచ్చే నెల 2వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో పాత మెడికల్‌ కళాశాలల్లో వంద శాతం కన్వీనర్‌ కోటా సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘గతంలో 20 మెడికల్‌ కళాశాలలు ఉంటే మా ప్రభుత్వం ఆ సంఖ్యను 56కు పెంచింది. వచ్చే నెల మూడో వారం నుంచి వైద్య విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ అంశంలో స్పష్టతనివ్వాలి. ప్రభుత్వం స్పందించని పక్షంలో మునుపటి 20 కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటాలో ఉన్న 1,900 సీట్లలో 15 శాతం అన్‌ రిజర్వుడు కోటాను తెలంగాణ విద్యార్థులు నష్టపోతారు. ఈ అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం దురదృష్టకరం. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2014 నుంచి కన్వీనర్‌ కోటాలో 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు పోటీ పడేందుకు వెసులుబాటు ఉంది. ఆ విధానంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని గుర్తించి కేవలం పాత 20 కళాశాలలకే పరిమితం చేశాం. నూతన కళాశాల్లో వంద శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకున్నాం. విభజనచట్టం కాలం తీరనున్న దృష్ట్యా పాత 20 కళాశాలల్లోని సీట్లను కూడా రాష్ట్ర విద్యార్థులు దక్కేలా ప్రభుతం చర్యలు తీసుకోవాలి’’ అని హరీశ్‌రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని