సంక్షిప్త వార్తలు (5)

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో 63.36 శాతం పోలింగ్‌  నమోదైంది.

Updated : 27 May 2024 06:03 IST

ఆరో దశలో 63.36% పోలింగ్‌

దిల్లీ: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో 63.36 శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు, ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో ఐదో దశలో మాత్రమే అత్యల్పంగా 62.2 శాతం పోలింగ్‌  రికార్డైంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఆరో దశలో భాగంగా శనివారం పోలింగ్‌  జరిగిన సంగతి తెలిసిందే. 


ప్రమాదంలో ప్రజాస్వామ్యం

దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టేందుకు అనేక మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఇప్పుడు మళ్లీ మన దేశ స్వేచ్ఛ, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయి. వాటిని పరిరక్షించేందుకు పంజాబీలు మరోసారి ముందుండి పోరాడాలి.

అరవింద్‌ కేజ్రీవాల్, దిల్లీ సీఎం (పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశంలో..)


ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడే ప్రసంగాల్లో తడబాటు

ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పుడే ప్రసంగాలు తడబడుతాయి. తన ప్రభుత్వం కూలిపోతోందని మోదీ గ్రహించారు. ప్రధాని పీఠం చేజారుతోందని ఆయనకు అర్థమైంది. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో మొదలైన విపక్ష విజయ వీచిక.. ఏడో విడతను చేరుకుంది. 400కుపైగా సీట్లు గెలుస్తామని నినాదమిచ్చినవారు ఓడిపోబోతున్నారు. 

అఖిలేశ్‌ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత (ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ..)


మోదీ డిస్కో డ్యాన్స్‌ చేస్తున్నారా?

ముస్లింల కోసం విపక్షాలు ‘ముజ్రా’ చేస్తున్నాయని మోదీ అన్నారు. ప్రధాని ఉపయోగించదగ్గ భాషేనా ఇది? చైనా మన భూభాగాన్ని దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించింది. కానీ ఆ విషయంలో మోదీ ఏమీ చేయలేదు. నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఆక్రమణల అంశంలో స్పందించకుండా ఆయనేమైనా డిస్కో డ్యాన్స్‌ చేస్తున్నారా?

అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంఐఎం అధినేత (బిహార్‌లోని పాటలిపుత్ర ప్రచార ర్యాలీలో..)


స్ట్రాంగ్‌రూంల వద్ద పని చేయని సీసీ కెమెరాలు 

నంద్యాల కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లిన ఏజెంట్లు 

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఆర్జీఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నంద్యాల జిల్లాలోని ఓ పార్లమెంటు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల వద్ద సీసీ కెమెరాలను అమర్చి కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఫుటేజీని నిరంతరం పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. శనివారం అర్ధరాత్రి 1 గంట నుంచి నంద్యాల, డోన్‌ నియోజకవర్గాల ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్‌రూంల వద్ద సీసీ కెమెరాలు పనిచేయక పోవడాన్ని ఏజెంట్లు గుర్తించారు. ఉదయం పరిశీలనకు వచ్చిన నంద్యాల కలెక్టర్‌ కె.శ్రీనివాసులు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా వెంటనే వాటిని బాగుచేయాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు సమాచారం.


తెదేపా కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడి

అనుమసముద్రంపేట, న్యూస్‌టుడే: తెదేపా కార్యకర్తపై వైకాపా శ్రేణులు దాడి చేసిన ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలం పెద్దబ్బీపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త చింతగుంట చంద్రారెడ్డి.. ఇటీవలి ఎన్నికల్లో చురుగ్గా పనిచేశారు. ఎన్నికల విషయమై చంద్రారెడ్డితో వైకాపాకు చెందిన నరసింహులు, మరికొందరు వ్యక్తులు శనివారం రాత్రి ఘర్షణకు దిగారు. అనంతరం కర్రలతో దాడిచేసి గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు చంద్రారెడ్డిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు పికెట్‌ ఏర్పాటుచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంగం ఎస్సై నాగార్జునరెడ్డి తెలిపారు.


ఎసైన్డ్‌ చట్టం రద్దుకు సీఎస్సే ప్రధాన కారణం

భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌డీ విల్సన్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎసైన్డ్‌ చట్టం రద్దుకు సీఎస్‌ జవహర్‌రెడ్డే ప్రధాన కారణమని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌డీ విల్సన్‌ మండిపడ్డారు. సీఎస్‌ను సస్పెండ్‌ చేసి వెంటనే ఆయనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘ముఖ్యమంత్రి తప్పుచేసినా సరైన మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత సీఎస్‌కు ఉంది. దళితుల భూములను ఎవరికీ దక్కకుండా పటిష్ఠమైన ఎసైన్డ్‌ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని తుంగలో తొక్కినవారిలో జవహర్‌రెడ్డి ఒకరు. భూమి కొనుగోలు పథకం, పండ్లతోటల పెంపకం, నర్సరీ ఏర్పాటు వంటివాటిని రద్దుచేయడానికి సీఎం జగన్‌తో పాటు సీఎస్‌ కూడా కారకులే. దీనిపై ప్రధానికి లేఖ రాస్తాను. ఆయనపై ఎట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి’ అని డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు