శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో నిందితులెవరో పోలీసులు తేలుస్తారు: మల్లు రవి

వనపర్తి జిల్లాలో భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య వెనక ఎవరున్నారో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులను పట్టుకుంటారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

Published : 27 May 2024 03:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: వనపర్తి జిల్లాలో భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య వెనక ఎవరున్నారో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులను పట్టుకుంటారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. హత్య నేపథ్యంలో కొల్లాపూర్, అచ్చంపేటలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించాలని భారాస నేత ప్రవీణ్‌కుమార్‌ అంటున్నారని.. ఆయన అనంతపురం ఎస్పీగా పనిచేసినప్పుడు పరిటాల రవి హత్య జరిగిందని, అందుకు ఆయనపై అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని రవి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత పిడమర్తి రవిలతో కలసి ఆదివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొల్లాపూర్‌లో బుల్డోజర్‌తో ఇళ్లు కూల్చుతున్నారని భారాస నేతలు ఆరోపిస్తున్నారని, బుల్డోజర్లకు కాంగ్రెస్‌ వ్యతిరేకమని ఆయన స్పష్టంచేశారు. జూన్‌ 4 తర్వాత నాగర్‌కర్నూల్‌లో సభ ఏర్పాటు చేస్తామన్నారు. వంశీకృష్ణ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై యుద్ధం చేస్తానంటూ ప్రవీణ్‌కుమార్‌ తొలుత బీఎస్పీలో చేరారని, ఇప్పుడు తన ఆత్మగౌరవాన్ని భారాస అధినేత కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. అమాయకులపై అక్రమ కేసులు పెట్టించడంలో గువ్వల బాలరాజు పేరొందారని ఆరోపించారు. నయీంతో సంబంధాలు బాలరాజుకే ఉన్నాయని, తమకు కాదని చెప్పారు. నయీం డైరీని బయటపెట్టాలని సీఎంని కోరతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని