ఇండియా కూటమి అధికారంలోకి రాగానే.. రైతులకు చట్టబద్ధంగా మద్దతు ధర

ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Published : 27 May 2024 03:22 IST

పంజాబ్‌ ప్రచారంలో భట్టి విక్రమార్క

పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంపై ఆ రాష్ట్ర నేతలను అడిగి తెలుసుకుంటున్న కేసీ వేణుగోపాల్, భట్టి

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మోగా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో వరి, పత్తి, చెరకు పంటలకు సరైన మద్దతు ధర లభించడంలేదని, దీంతో రైతులు నష్టాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రధాని మోదీ నల్లచట్టాలు తీసుకొచ్చి రైతుల కష్టఫలాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కేంద్రంలో అధికారం చేపట్టనున్న ఇండియా కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుంది. కోట్ల మంది నిరుద్యోగులకు ఏడాదికి రూ.లక్ష చొప్పున నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కూలీలకు లభిస్తున్న రోజువారీ కూలీని రూ.250 నుంచి రూ.400కు పెంచుతాం. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తాం. ఇండియా కూటమి కోట్ల మంది దేశ ప్రజలను లక్షాధికారులను చేస్తుంది. మటన్, మందిర్, మంగళసూత్రం, మైనార్టీ లాంటి అంశాలపైనే ప్రధాని మాట్లాడుతున్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అడగడం లేదు. కాంగ్రెస్‌ను చూసి భాజపా భయపడుతోంది’’ అని అన్నారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని