‘ముజ్రా’ విమర్శ బిహార్‌ను అవమానించడమే

విపక్ష నాయకులకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ చేసిన ‘ముజ్రా’ విమర్శపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 27 May 2024 06:26 IST

సోనియా, రాహుల్‌ను కించపరచడమే మోదీకి తెలుసు: ఖర్గే 

సాసారాం: విపక్ష నాయకులకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ చేసిన ‘ముజ్రా’ విమర్శపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని విమర్శ బిహార్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. సాసారాం లోక్‌సభ అభ్యర్థి మనోజ్‌కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ముజ్రా వ్యాఖ్యను ఉపయోగించడం ద్వారా మోదీ బిహార్‌ను అవమానించారు. ఆయన మాటల అర్థం రాష్ట్రంలో ముజ్రా కార్యక్రమాలు జరుగుతున్నాయనే. ఇది రాష్ట్రంతో పాటు ప్రజలను అవమానించడమే. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత దిగజారుడుగా ఎలా మాట్లాడతారు? ఆయన మర్యాద పురుషోత్తముడిలా మాట్లాడాలి. మోదీ తనను తాను తీస్‌ మార్‌ ఖాన్‌గా భావిస్తున్నారు. ఆయన తప్పుడు భ్రమల్లో ఉన్నారు. ఇక్కడి ప్రజలే నిజమైన తీస్‌మార్‌ ఖాన్‌లు. మోదీ నియంత. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. భాజపా మత విద్వేషాలను విస్తరింపజేస్తోంది. తద్వారా సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తోంది. మోదీ కానీ, భాజపా నేతలు కానీ పెరుగుతున్న నిరుద్యోగం, అధిక ధరలపై మాట్లాడరు. రాజ్యాంగంపై మాత్రం దాడికి దిగుతారు. విద్వేష రాజకీయాలకు పాల్పడతారు. అటువంటివారిని తప్పకుండా ఓడించాలి. మతం, కులం పేరిట వారు (భాజపా నేతలు) దేశాన్ని విభజించాలని చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలను కాపాడేందుకు సాగుతున్నవి.  ప్రాథమికంగా ఈ ఎన్నికలు ప్రజలకు, మోదీకి మధ్య జరుగుతున్నవి తప్ప మోదీకి రాహుల్‌కు మధ్య జరుగుతున్నవి కావు’’ అని ఖర్గే పేర్కొన్నారు. ప్రధానిగా తాను మోదీని గౌరవిస్తానని అయితే ఆయన తమ పార్టీ నేతలను మాత్రం గౌరవించడంలేదని తెలిపారు. సోనియా, రాహుల్‌ సహా ఇతర నేతలను ఎలా కించపరచాలో మాత్రమే మోదీకి తెలుసని ఆక్షేపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని