ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి: బండి సంజయ్‌

రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత భారాస పాలన సమయంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ చేయించాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 28 May 2024 03:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత భారాస పాలన సమయంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ చేయించాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలనే ఉల్లంఘించి ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందనేందుకు అప్పటి అధికారి రాధాకిషన్‌రావు వాంగ్మూలమే నిదర్శనమన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు ఫోన్‌ ట్యాపింగ్‌కు బాధ్యత వహించాలని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ప్రతిపక్షాలపై గత ప్రభుత్వం చేసిన ఈ సైబర్‌ దాడి.. ఎమర్జెన్సీ కంటే దారుణమైన వ్యవహారం. రాధాకిషన్‌రావు వాంగ్మూలాన్ని పరిశీలిస్తే ప్రతిపక్షాలను.. ముఖ్యంగా భాజపా సానుభూతిపరులను, పార్టీకి విరాళాలు ఇచ్చేవాళ్లను, మీడియా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ అంశంపై శాసనసభ స్పీకర్‌ తగిన చర్యలు తీసుకోవాలని భాజపా పక్షాన కోరుతున్నా’’ అని సంజయ్‌ పేర్కొన్నారు. వడ్ల కుంభకోణంలో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌పై ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు: ఎమ్మెల్యే సత్యనారాయణ

సుభాష్‌నగర్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రాధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తన ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

‘నా ఓటమికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కారణం..’ 

అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కారణమని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు. తన ప్రతి కదలికను ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకొన్నారన్నారు. సోమవారం కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నాపై పోటీచేసిన భారాస అభ్యర్థి సంజయ్‌ కేసీఆర్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఫోన్‌ ట్యాపింగ్‌పై ప్రభుత్వాన్ని, కోర్టును ఆశ్రయిస్తా’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని