ఘనంగా దశాబ్ది వేడుకల ముగింపు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను జూన్‌ 2న ఘనంగా నిర్వహించాలని భారాస అధినేత కేసీఆర్‌ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జూన్‌ 1, 2, 3 తేదీల్లో మూడు రోజులపాటు వేడుకలు జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 28 May 2024 04:00 IST

భారాస శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్‌ పిలుపు 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను జూన్‌ 2న ఘనంగా నిర్వహించాలని భారాస అధినేత కేసీఆర్‌ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జూన్‌ 1, 2, 3 తేదీల్లో మూడు రోజులపాటు వేడుకలు జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘జూన్‌ 1న సాయంత్రం 7గంటలకు గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్‌ ర్యాలీ ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి, ఘన నివాళి అర్పిస్తారు. 2న వేడుకల సభ హైదరాబాద్‌లోని భారాస కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతుంది. అదేరోజు హైదరాబాద్‌లోని పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. 3న అన్ని జిల్లాల్లోని భారాస కార్యాలయాల్లో ముగింపు వేడుకలు ఉంటాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆయా జిల్లాల్లోని ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాల్లో మిఠాయిలు, పండ్లు పంపిణీ చేస్తారు’’ అని ప్రకటనలో వివరించారు. తెలంగాణ సాధించి, తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని దశాబ్ద కాలంపాటు ప్రగతిపథంలో నడిపించి, దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత భారాసదేనని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. ఈ చారిత్రక సందర్భంలో నిర్వహిస్తున్న దశాబ్ది ముగింపు వేడుకల్లో కార్యకర్తలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేసీఆర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని