చండీగఢ్‌లో హోరాహోరీ

కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో సార్వత్రిక సమరం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ బరిలో దిగగా.. భాజపా సిటింగ్‌ ఎంపీని పక్కనపెట్టి సంజయ్‌ టండన్‌కు టికెట్‌ కేటాయించింది.

Updated : 28 May 2024 06:03 IST

మనీశ్‌ తివారీకి గట్టి సవాల్‌ విసురుతున్న సంజయ్‌ టండన్‌ 

కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో సార్వత్రిక సమరం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ బరిలో దిగగా.. భాజపా సిటింగ్‌ ఎంపీని పక్కనపెట్టి సంజయ్‌ టండన్‌కు టికెట్‌ కేటాయించింది. దాదాపుగా పోటీ అంతా వీరిద్దరి మధ్యే కేంద్రీకృతమైంది. ‘బయటి వ్యక్తి’ అంటూ తివారీపై సంజయ్‌ విమర్శలు గుప్పిస్తుండగా.. స్థానిక సమస్యలు సహా ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని కాంగ్రెస్‌ నేత ప్రకటించారు. వారిద్దరి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో చండీగఢ్‌ పోరు వేడెక్కింది. 


సంజయ్‌: స్థానిక సమస్యలు తెలుసంటూ..  

చండీగఢ్‌ భాజపా సిటింగ్‌ స్థానం. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన కిరణ్‌ ఖేర్‌ను కాదని ఈసారి సంజయ్‌కి పార్టీ టికెట్‌ ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ మాజీ గవర్నర్‌ బలరామ్‌జీదాస్‌ టండన్‌ కుమారుడీయన. ప్రస్తుతం చండీగఢ్‌ భాజపా అధ్యక్షుడిగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో జోరుగా పర్యటిస్తున్న సంజయ్‌.. చండీగఢ్‌ ప్రగతి కోసం తనకు ఓటేయాలని కోరుతున్నారు. మనీశ్‌ తివారీని రాజకీయ పర్యాటకుడిగా అభివర్ణిస్తున్నారు. తివారీ గతంలో లుధియానా, ఆనంద్‌పుర్‌ సాహిబ్‌ ఎంపీగా పనిచేసిన సంగతిని గుర్తుచేస్తూ.. వాటిలో అభివృద్ధి పనులేవీ చేయకపోవడం వల్లే మరోసారి సీటు మారారని విమర్శిస్తున్నారు. 2029 లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఓటర్లకు ఆయన ముందే చెప్పాలంటూ ఎద్దేవా చేస్తున్నారు. తివారీ తనను తాను జాతీయ స్థాయి నేతగా చెప్పుకొంటుంటారని.. కానీ లుధియానా, ఆనంద్‌పుర్‌ సాహిబ్‌ల్లోని కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆయన్ను కనీసం ప్రచారానికి పిలవకపోవడం అసలు పరిస్థితిని తెలియజేస్తోందని పేర్కొంటున్నారు. చండీగఢ్‌లో ఎన్ని సెక్టార్లు, గ్రామాలు ఉన్నాయో కూడా తివారీకి తెలియదని సంజయ్‌ అంటున్నారు. స్థానిక అంశాలపై తనకు పట్టు ఉందని చెబుతూ.. హౌజింగ్‌ బోర్డు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. అయితే స్థానికంగా కొందరు భాజపా నేతల నుంచి ఆయనకు ఆశించిన మద్దతు లభించడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 


తివారీ: ఇక్కడే పుట్టి పెరిగానంటూ..

చండీగఢ్‌లో గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి పరాజయం పాలైన కేంద్ర మాజీ మంత్రి, స్థానిక మాజీ ఎంపీ పవన్‌ కుమార్‌ బన్సల్‌ ఈసారీ టికెట్‌ ఆశించారు. కానీ ఆనంద్‌పుర్‌ సాహిబ్‌ ఎంపీగా ఉన్న మనీశ్‌ తివారీని పార్టీ ఇక్కడికి పంపి టికెట్‌ ఇచ్చింది. తివారీ చండీగఢ్‌లోనే పుట్టి పెరిగినా.. లుధియానా, ఆనంద్‌పుర్‌ సాహిబ్‌ల నుంచి ఇంతకుముందు ఎంపీగా గెలిచారు. తనను బయటి వ్యక్తిగా భాజపా నేతలు పేర్కొంటుండటాన్ని ఆయన తప్పుబడుతున్నారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై తనతో బహిరంగ చర్చకు రావాలంటూ సంజయ్‌కి సవాలు విసురుతున్నారు. 2029 తర్వాత కూడా తాను చండీగఢ్‌లోనే కొనసాగుతానని స్థానికులకు హామీ ఇస్తున్నారు. విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రస్తుతం ఆయనకు మద్దతు ప్రకటించాయి. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌-ఆప్‌ కూటమి మంచి ఫలితాలు దక్కించుకోవడం సానుకూలాంశం. చండీగఢ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, రెండుసార్లు మేయర్‌గా పనిచేసిన సుభాష్‌ చావ్లా పార్టీని వీడటం, టికెట్‌ దక్కకపోవడంతో బన్సల్‌ అసంతృప్తికి లోనవడం తివారీకి ప్రతికూలాంశాలు. అయితే బన్సల్‌ తనకు మద్దతిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.

ఈనాడు ప్రత్యేక విభాగం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని