1వ తేదీన ఇండియా కూటమి నేతల భేటీ

లోక్‌సభ ఎన్నికల్లో తమ పనితీరును అంచనా వేసుకునేందుకు, ఫలితాల నేపథ్యంలో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు జూన్‌ 1న భేటీ కానున్నారు. ఏడో దశ పోలింగ్‌ జరుగుతుండగా ఒకటో తేదీన  దిల్లీలో సమావేశం జరగనున్నట్లు కూటమి వర్గాలు తెలిపాయి.

Updated : 28 May 2024 05:55 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తమ పనితీరును అంచనా వేసుకునేందుకు, ఫలితాల నేపథ్యంలో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు జూన్‌ 1న భేటీ కానున్నారు. ఏడో దశ పోలింగ్‌ జరుగుతుండగా ఒకటో తేదీన  దిల్లీలో సమావేశం జరగనున్నట్లు కూటమి వర్గాలు తెలిపాయి. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని కేంద్రంలో మరోమారు అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని, సొంతంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఇండియా కూటమి చెబుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు. సమావేశానికి హాజరు కావాలంటూ ఇప్పటికే ఆయన ఆహ్వానాలు పంపారు. తమిళనాడు, దిల్లీ ముఖ్యమంత్రులు స్టాలిన్, కేజ్రీవాల్, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ సహా కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలు సమావేశానికి హాజరు కానున్నట్లు తెలిసింది. మరోవైపు, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జూన్‌ 2న తిహాడ్‌ జైలు అధికారుల ఎదుట లొంగిపోనున్న సంగతి తెలిసిందే. 


నేను హాజరుకాలేను: మమతా బెనర్జీ 

కోల్‌కతా: ఒకటో తేదీన జరిగే ఇండియా కూటమి సమావేశానికి తాను హాజరు కావడం లేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం తెలిపారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్‌ ఆ రోజున రాష్ట్రంలోనూ జరగనుందని, రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో రెమాల్‌ తుపాను విధ్వంసం నేపథ్యంలో సహాయ పునరావాస చర్యలను పర్యవేక్షించాల్సి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని