రాహుల్, ప్రియాంకలను ఓటమికి బాధ్యులను చేయరు

లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన పదవిని వదులుకోవాల్సి వస్తుందని.. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలను మాత్రం ఓటమికి బాధ్యులను చేయరని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు.

Updated : 28 May 2024 05:49 IST

యూపీ సభల్లో అమిత్‌ షా

కుశీనగర్, బలియా, చందౌలీ (యూపీ): లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన పదవిని వదులుకోవాల్సి వస్తుందని.. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలను మాత్రం ఓటమికి బాధ్యులను చేయరని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. ఈవీఎంల వల్లే ఓడిపోయామంటూ రాహుల్‌ పరివారం ఓ మీడియా సమావేశం కూడా నిర్వహిస్తుందని జోస్యం చెప్పారు. సోమవారం యూపీలోని కుశీనగర్, బలియా, చందౌలీ ఎన్నికల సభల్లో అమిత్‌ షా మాట్లాడారు. ‘‘మొదటి అయిదు దశల పోలింగు సమాచారం నా వద్ద ఉంది. ప్రధాని మోదీ ఇప్పటికే 310 స్థానాలు అధిగమించారు. రాహుల్‌కు 40, అఖిలేశ్‌కు నాలుగుకు మించి రావు. తన పరిపాలన కాలంలో మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ప్రతి ఆర్నెల్లకోసారి థాయిలాండ్‌ విహారానికి వెళ్లే రాహుల్‌ పూర్వాంచల్‌ ప్రాంత వేడిని తట్టుకోలేరు’’ అన్నారు. ఇద్దరు యువరాజులు (రాహుల్, అఖిలేశ్‌) రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, మోదీ హయాంలో 25 పైసల అవినీతి కూడా లేదన్నారు. ‘సహారా’ నిధులతో అఖిలేశ్‌ పార్టీ నడిచేదని, వారి హయాంలోనే ఆ కుంభకోణం జరిగిందని తెలిపారు. ఎస్పీ, బీఎస్పీ పాలనలో చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయని, యోగి సర్కారు వచ్చాక చెరకు రైతుల బకాయిలు చెల్లించారన్నారు. రామభక్తులపై ఎస్పీ ప్రభుత్వం కాల్పులు జరపగా, అయోధ్య సమస్యను కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లు నాన్చిందని.. మోదీ వచ్చాకే ఆలయ నిర్మాణం సాకారమైందని అమిత్‌ షా చెప్పారు.  


రాహుల్‌ వచ్చాక కాంగ్రెస్‌ ప్రమాణాలు పడిపోయాయి 

దిల్లీ: రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌లో క్రియాశీలం అయ్యాక ఆ పార్టీ కార్యకలాపాల్లో మార్పు వచ్చిందని, అప్పటినుంచి పార్టీ ప్రమాణాలు పడిపోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా వారు పార్లమెంటును బహిష్కరించడానికి రకరకాల సాకులు చెబుతున్నారన్నారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధానమంత్రి సమాధానం ఇస్తున్నప్పుడు గంటన్నరపాటు ఆయనకు అంతరాయం కలిగించడం నా రాజకీయ చరిత్రలో నేనెప్పుడూ చూడలేదు. దేశ ప్రజలు తమ ఓట్లతో నరేంద్ర మోదీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టారు. ఆయనను అగౌరవపరచడం రాజ్యాంగ వ్యవస్థను కించపరచడంతో సమానం’’అని షా పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని