సంక్షిప్త వార్తలు (4)

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన బంధువుల అండతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి, తాడేపల్లి పెద్దలు కలిసి రూ.2 వేల కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడ్డారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Updated : 28 May 2024 06:07 IST

సీఎస్‌పై ఈసీ విచారణ జరపాలి: బొండా ఉమా  

విజయవాడ (చుట్టుగుంట), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన బంధువుల అండతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి, తాడేపల్లి పెద్దలు కలిసి రూ.2 వేల కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడ్డారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. 


సజ్జల భార్గవ్‌రెడ్డి ప్రోద్బలంతో చంద్రబాబుపై దుష్ప్రచారం 

డీజీపీకి తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ 

ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడాన్ని సజ్జల భార్గవ్‌రెడ్డి ప్రోద్బలంతో వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఓ అలవాటుగా మార్చుకుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వర్రా రవీంద్రరెడ్డి అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురుద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాల్ని అడ్డుకోవాలని కోరుతూ డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తాకు సోమవారం లేఖ రాశారు. తెదేపా నేతల ప్రతిష్ఠను దిగజార్చేలా, వర్గ విద్వేషాలు రెచ్చగొట్టేలా  పోస్టులు పెట్టే భార్గవ్‌రెడ్డి, రవీంద్రరెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. రవీంద్రరెడ్డి ఎక్స్‌ ఖాతాలో.. చంద్రబాబు చికిత్స చేయించుకున్నట్లు పెట్టిన మార్ఫింగ్‌ ఫొటో స్క్రీన్‌ షాట్‌ను లేఖకు జత చేశారు. 


తెదేపా కార్యకర్తలకు రూ.10 కోట్లతో సంక్షేమ నిధి

-నారాయణ 

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: తెదేపా విజయానికి కష్టపడిన కార్యకర్తల కోసం రూ.10 కోట్లతో సంక్షేమ నిధిని తమ కుటుంబసభ్యుల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, నెల్లూరు నగర తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ ప్రకటించారు. నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు నుంచే సుమారు 600 మంది మహిళలతో శాఖను ఏర్పాటు చేశామని తెలిపారు. వీరంతా ఎన్నికల్లో కష్టపడి పనిచేశారన్నారు. మహిళా శక్తి టీమ్‌ సభ్యులకు ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో వారికి శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ పొందిన వారికి కంపెనీలు, ఆసుపత్రులు, ఇతర వ్యాపార రంగాల్లో ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ అనురాధ, నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహిగా ముద్ర వేస్తున్నారు 

ప్రజాస్వామ్యంలో మనకు- ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది. విమర్శించే హక్కు కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం సర్కారును విమర్శించిన ప్రతిసారీ దేశద్రోహి అనే ముద్ర వేస్తున్నారు. హిందూ వ్యతిరేకి అంటున్నారు. అంటే మోదీ పాలనలో విమర్శించడం చట్టబద్ధం ఎంతమాత్రమూ కాదు.

శశి థరూర్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత (చండీగఢ్‌లో విలేకర్ల సమావేశంలో..) 


మరి మోదీ తబలా వాయిస్తున్నారా? 

ఓటుబ్యాంకు ముందు విపక్షాలు ‘ముజ్రా’ చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మరి ఆయనేం చేస్తున్నారు? తబలా వాయిస్తున్నారా? భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయం. అందుకే అధికార పక్ష నేతలు అవివేకంతో ఏదేదో మాట్లాడుతున్నారు.

రాబ్డీ దేవీ, బిహార్‌ మాజీ సీఎం (పట్నాలో విలేకర్లతో మాట్లాడుతూ..) 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని