అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్‌ జవహర్‌రెడ్డిని బదిలీ చేయండి

సుమారు 800 ఎకరాల ఎసైన్డ్‌ భూములను సొంత మనుషులకు కట్టబెట్టి భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని బదిలీ చేయాలని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 28 May 2024 05:03 IST

ఈసీకి తెదేపా మాజీ ఎంపీ కనకమేడల లేఖ

ఈనాడు, దిల్లీ: సుమారు 800 ఎకరాల ఎసైన్డ్‌ భూములను సొంత మనుషులకు కట్టబెట్టి భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని బదిలీ చేయాలని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు లేఖరాశారు. ‘‘సీఎస్‌ జవహర్‌రెడ్డి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌.. సీఎస్‌కు వ్యతిరేకంగా ఆరోపణలుచేయడంతోపాటు, వాటికి కట్టుబడి ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించారు. జీఓ నం.596 జారీ గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని దాని పరిధిలోకి వచ్చే భూములను తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్‌ చేయించేలా అధికారులను సీఎస్‌ ప్రభావితం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటు ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరగబోతున్న తరుణంలో సీఎస్‌గా జవహర్‌రెడ్డిని కొనసాగించడం ఏమాత్రం మంచిదికాదు. అత్యున్నత స్థానంలో ఉన్న అధికారే అవినీతి వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో ఆయన హయాంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరుగుతుందన్న నమ్మకం రాజకీయపార్టీలకు కలగడంలేదు. ఆయన్ను తక్షణం ఆ స్థానం నుంచి బదిలీ చేయాలి. ఆయన హయాంలో జరిగిన భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో పరిపాలనాధికారాలన్నీ ఎన్నికలసంఘం ఆధ్వర్యంలోనే ఉన్నందున తక్షణం ఈయనపై చర్యలు తీసుకోవాలి’’ అని కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు