ఇంకా కక్ష సాధింపులే!

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయి త్వరలో ఫలితాలు వెలువడనున్న సమయంలోనూ తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై  వైకాపా ప్రభుత్వ పెద్దలు కక్ష సాధింపులకు యత్నిస్తూనే ఉన్నారు.

Published : 28 May 2024 05:04 IST

14 మంది పుర ఉద్యోగులపై కేసు నమోదుకు రంగం సిద్ధం
రూ.24 లక్షలు దుర్వినియోగమైనట్లు అభియోగం
చక్రం తిప్పుతున్న కీలకనే

ఈనాడు, కర్నూలు: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయి త్వరలో ఫలితాలు వెలువడనున్న సమయంలోనూ తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై  వైకాపా ప్రభుత్వ పెద్దలు కక్ష సాధింపులకు యత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చక్రం తిప్పుతున్న ఓ కీలక నేత ఆదేశాలతో పలువురు అధికారులపై కేసుల నమోదుకు రంగం సిద్ధమవుతోంది. డోన్‌ పురపాలక పరిధిలో గత తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన పలు పనులపై విజిలెన్స్‌ అధికారులు 2021 సంవత్సరం నుంచి పలు దఫాలుగా విచారణ జరిపారు. రెండు నెలల క్రితం ప్రభుత్వానికి నివేదిక అందించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, డీజిల్‌ కొనుగోలులో రూ.24 లక్షలు దుర్వినియోగమైనట్లు తేల్చి..దీనికి 14 మందిని బాధ్యులుగా గుర్తించారు. తాజాగా వారిపై కేసులు పెట్టాలని డోన్‌ మున్సిపల్‌ కమిషనర్‌కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. నిందితుల్లో కొందరు డీఈలు, ఏఈలు ఉన్నారు. కొందరు కొన్ని నెలల కిందటే ఉద్యోగ విరమణ పొందారు. 

అసలు లక్ష్యం తెదేపా నాయకుడు ఫణిరాజ్‌

డోన్‌ పట్టణంలో గట్టిపట్టున్న తెదేపా నేత, మాజీ కౌన్సిలర్‌ కొట్రికే ఫణిరాజ్‌ను వైకాపాలో చేరాలని గతంలో కొందరు ఒత్తిడి తెచ్చారు. లొంగకపోవడంతో ఆయన నివాస ప్రాంగణంలో ప్రభుత్వ భూమి కలిసిందని 2020లో ప్రహరీసహా ఇంటిలోని కొంత భాగాన్ని ఆయన పుట్టిన రోజునే కూలగొట్టారు. ఆయన భార్య గాయత్రీదేవి 2014 నుంచి 2019 వరకు డోన్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా విధులు నిర్వర్తించడంతో ఆమె హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. ఫణిరాజ్‌ పార్టీ మారకుండా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డోన్‌ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి విజయానికి పనిచేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని ఓడించడానికి కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఫణిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 14 మందిపై కేసు నమోదు చేయాలని లిఖితపూర్వక ఆదేశాలు అందినట్లు ఓ అధికారి ‘ఈనాడు’కు వెల్లడించారు. రెండుమూడు రోజుల్లో కేసు నమోదు చేయిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని