భాజపా 200 మార్కును దాటదు: ఖర్గే

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామంటూ భాజపా చెబుతున్న మాటలు వట్టి ప్రగల్భాలేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు.

Published : 29 May 2024 06:39 IST

చండీగఢ్‌: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామంటూ భాజపా చెబుతున్న మాటలు వట్టి ప్రగల్భాలేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఆ పార్టీ 200 స్థానాల మార్కును కూడా దాటదని పేర్కొన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో భాజపా సీట్లు తగ్గుతున్నాయి. మా స్థానాలు పెరుగుతున్నాయి. 400కుపైగా నియోజకవర్గాలను గెల్చుకుంటామని కమలదళం చెబుతున్న మాటల్లో అర్థం లేదు. ఆ పార్టీ తమిళనాడు, కేరళ, తెలంగాణల్లో మనుగడలోనే లేదు. కర్ణాటకలో బలంగా లేదు. మహారాష్ట్రలో బలహీనంగా ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో గట్టి పోటీ ఉంది. ఇంకెక్కడి నుంచి భాజపాకు 400కుపైగా సీట్లు వస్తాయి’’ అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయాక ఖర్గే తన ‘ఉద్యోగం’ కోల్పోతారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యను ఖర్గే తిప్పికొట్టారు. ప్రజలకు సేవ చేయడానికే తప్ప.. ‘ఉద్యోగం’ చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు.  

మోదీ నోట కాంగ్రెస్‌ జపం

పదేళ్ల పాలనలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులేవీ ప్రధాని మోదీ చేయలేదని ఖర్గే విమర్శించారు. అందుకే ఆయన కాంగ్రెస్‌ పార్టీపై దుష్ప్రచారం చేస్తూ ఓట్లడుగుతుంటారని పేర్కొన్నారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. ప్రతిరోజు దేవుడి కంటే కాంగ్రెస్‌ పేరునే మోదీ ఎక్కువగా జపిస్తారు. రాహుల్‌పేరును పదేపదే తలుచుకుంటారు’’ అని అన్నారు.


మతం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మోదీ

-ప్రియాంక 

ఉనా: ప్రధాని మోదీ అధికారం కోసం మతం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆరోపించారు. ఆయన్ను ప్రజా వ్యతిరేకిగా అభివర్ణించారు. హిమాచల్‌లోని ఉనాలో పార్టీ మంగళవారం నిర్వహించిన ర్యాలీలో ప్రియాంక ఈ మేరకు ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని