విపక్షాలు విసిరే చెత్తను ఎరువుగా మారుస్తా

పాతికేళ్లుగా విపక్షాల దుర్భాషలు తాను వింటూనే ఉన్నానని.. ఇప్పుడు దూషణల నిరోధకంగా మారిపోయినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Published : 29 May 2024 06:39 IST

జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

దిల్లీ: పాతికేళ్లుగా విపక్షాల దుర్భాషలు తాను వింటూనే ఉన్నానని.. ఇప్పుడు దూషణల నిరోధకంగా మారిపోయినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గత ఎన్నికల సమయంలో ‘మౌత్‌ కా సౌదాగర్‌’, ‘గందీ నాలీ కా కీడా’ అనే వ్యక్తిగత దూషణలు ఎదుర్కొనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చివరిదశ పోలింగుకు ముందు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తమను అణచివేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విపక్షాల నుంచి వస్తున్న విమర్శలపైనా మోదీ స్పందించారు. ‘‘అందుకు నిదర్శనం ఏమిటని చెత్తను విసిరే వ్యక్తిని అడగండి. నేను ఆ చెత్తను ఎరువుగా మార్చి, ఈ దేశం కోసం మంచి ఉత్పత్తులను అందిస్తాను. పదేళ్లపాటు మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో కేవలం రూ.34 లక్షల అక్రమ ధనం మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. గత పదేళ్ల మా హయాంలో రూ.2,200 కోట్లను ఈడీ సీజ్‌ చేసింది. దేశానికి అన్ని కోట్ల రూపాయలను వెనక్కి తెచ్చిన వ్యక్తిని గౌరవించాలి.. నిందించకూడదు. ఆ డబ్బును దొంగతనం చేసిన వ్యక్తి పట్టుబడిన తర్వాత అరుస్తూనే ఉంటాడు’’ అన్నారు. ఎవరు జైలుకు వెళ్లాలన్నది మోదీ నిర్ణయిస్తారని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘‘ఇలాంటి వ్యక్తులు ఈ దేశ రాజ్యాంగం, చట్టంపై అవగాహన పెంచుకోవాలి’’ అని చురకలంటించారు. ఎన్నికలు ఉన్నా, లేకపోయినా ప్రతిపక్ష నేతల ప్రవర్తన ఇలాగే ఉంటుందని దుయ్యబట్టారు. నిరాశలో ఉన్నవారికి దూషించడం ఒక స్వభావంగా మారిపోయిందని మోదీ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు