చట్టపరమైన పాలనకు మోదీ ముగింపు పలికారు: రాహుల్‌

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో హత్యకు గురైన ఓ దళిత యువకుడి సోదరి మృతి పట్ల భాజపా వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు.

Updated : 29 May 2024 06:16 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో హత్యకు గురైన ఓ దళిత యువకుడి సోదరి మృతి పట్ల భాజపా వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ చట్టపరమైన పాలనకు ముగింపు పలికారంటూ దుయ్యబట్టారు. బాధిత మహిళల పట్ల కాకుండా భాజపా ఎల్లప్పుడూ దోషుల వైపే ఉంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, బలహీనులైన ప్రజలు సైతం అణచివేతకు వ్యతిరేకంగా ప్రశ్నించే వ్యవస్థను నెలకొల్పుతామని ‘ఎక్స్‌’ వేదికగా రాహుల్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ వాద్రా కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల మహిళలు గౌరవంగా బతకాలని భాజపా కోరుకోవట్లేదన్నారు. అఘాయిత్యాలకు బలైన మహిళలు న్యాయం కోరుకుంటే వారి కుటుంబాలను నాశనం చేస్తున్నారని ఆమె విమర్శించారు. తన సోదరుడిని కొందరు వ్యక్తులు కొట్టి చంపారంటూ గత ఆగస్టులో ఓ దళిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ ఆమెపై నిందితులు ఒత్తిడి తెచ్చారు. మరోవైపు పాత శత్రుత్వంతో మహిళ మామనూ కొందరు వ్యక్తులు శనివారం రాత్రి కొట్టి చంపారు. ఆయన మృతదేహాన్ని తరలిస్తున్న క్రమంలో అంబులెన్సు నుంచి కిందపడి మహిళ ప్రాణాలు కోల్పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని