ఉపాధ్యాయుడి ఇంటిపై పెట్రోల్‌ సీసాలతో దాడి

ఎన్నికల్లో తెదేపాకు అనుకూలంగా పనిచేశారని ఓ ఉపాధ్యాయుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్‌ సీసాలతో దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జంగంనర్సాయపల్లిలో చోటుచేసుకొంది.

Published : 29 May 2024 05:04 IST

వైకాపా కుట్రేనని తెదేపా నేతల ఆరోపణ

దాడి వివరాలను డీఎస్పీ రామరాజుకు తెలియజేస్తున్న ఉపాధ్యాయుడు నారాయణ 

వెలిగండ్ల(కనిగిరి), న్యూస్‌టుడే: ఎన్నికల్లో తెదేపాకు అనుకూలంగా పనిచేశారని ఓ ఉపాధ్యాయుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్‌ సీసాలతో దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జంగంనర్సాయపల్లిలో చోటుచేసుకొంది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తీట్ల నారాయణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగం రాకముందు తెదేపా సానుభూతిపరుడిగా ఉండేవారు. ఉద్యోగం రావడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన సతీమణి చెన్నలక్ష్మి తెదేపా నాయకురాలిగా పనిచేస్తున్నారు. ఇటీవల కనిగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తరఫున ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ విషయంలో గ్రామానికి చెందిన కొందరితో విభేదాలున్నాయి. సోమవారం రాత్రి నారాయణ కుటుంబసభ్యులు ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బీరు సీసాల్లో పెట్రోల్‌ నింపి ఇంటిపైకి విసిరారు. అవి ప్రహారీని తాకి ఒక్కసారిగా మంటలు రావడంతో నారాయణ కుటుంబసభ్యులు నిద్రలేచి కేకలు వేశారు. దీంతో దుండగులు పరారయ్యారు. కనిగిరి డీఎస్పీ రామరాజు గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌టీంను రప్పించి, వేలిముద్రలు సేకరించారు. బాధిత కుటుంబాన్ని తెదేపా నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇది వైకాపా నాయకుల పనేనని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని