జీవో రాకముందే బలవంతపు ఒప్పందాలు

విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో రూ.వేల కోట్ల విలువైన ఎసైన్డ్‌ భూములకు జీవో విడుదల కాకముందే ఎస్సీ, ఎస్టీ, బీసీలతో బలవంతంగా ఒప్పందాలు చేసుకున్నారని జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ ఆరోపించారు.

Published : 29 May 2024 05:06 IST

సిటింగ్‌ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరపాలని మూర్తియాదవ్‌ డిమాండ్‌

పత్రాలు చూపిస్తున్న మూర్తియాదవ్‌

ఈనాడు-విశాఖపట్నం, సీతంపేట-న్యూస్‌టుడే: విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో రూ.వేల కోట్ల విలువైన ఎసైన్డ్‌ భూములకు జీవో విడుదల కాకముందే ఎస్సీ, ఎస్టీ, బీసీలతో బలవంతంగా ఒప్పందాలు చేసుకున్నారని జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ ఆరోపించారు. ఎసైన్డ్‌ భూముల విషయంలో తాను చేసిన ఆరోపణలకు సీఎస్‌ జవహర్‌రెడ్డి సమాధానం ఇవ్వలేదన్నారు. మంగళవారం విశాఖలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జీఓ 596 విడుదలైన పదిరోజుల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయని చెప్పారు. గండిగుండం సర్వే నంబరు 271/6లో కాలకొండ భరత్‌ సుభాష్, ముకుందపురంలో మెహర్‌ చైతన్యవర్మ, సుభాష్‌ల పేరుపై అనేక రిజిస్ట్రేషన్లు జరిగాయంటూ డాక్యుమెంట్లు ప్రదర్శించారు. వీళ్లంతా ఎవరి బినామీలని ప్రశ్నించారు. ముందుగా అగ్రిమెంట్‌ చేసుకున్న భూములనే 596 జీఓ కింద రిలీజ్‌ చేశారని, రైతులు నేరుగా దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారని అన్నారు.

ఈసీలు, సర్టిఫైడ్‌ కాపీలు రాకుండా వెబ్‌సైట్‌ బ్లాక్‌ చేశారు

ఎన్నికల కోడ్‌ వచ్చాక జరిగిన ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు బయటకు పొక్కకుండా ఈసీ, సర్టిఫైడ్‌ కాపీలు రాకుండా రెవెన్యూ వెబ్‌సైట్‌ను జవహర్‌రెడ్డి బ్లాక్‌ చేయించారని మూర్తియాదవ్‌ ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే సీపీ వద్ద లొంగిపోతానని ఆయన సవాలు చేశారు. ఎసైన్డ్‌ భూముల వ్యవహారంపై సిటింగ్‌ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల బినామీలు, ఇంకా ధనుంజయరెడ్డి, సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌ అనుయాయులు ఎసైన్డ్‌ భూములు కొట్టేశారని మూర్తియాదవ్‌ ఆరోపించారు. ఆయన వెంట పీవీఎస్‌ఎన్‌ రాజు, నాగలక్ష్మి చౌదరి పాల్గొన్నారు.

భూముల అన్యాక్రాంతానికి చట్టబద్ధత కల్పించినట్లే: ఈఏఎస్‌ శర్మ 

‘జీఓ 596 వల్ల ఎసైన్డ్, ఈనాం భూములకు సక్రమమనే ముద్ర వేసి అన్యాక్రాంతం చేయడానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుంది. ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన భూములు అనర్హుల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఈ జీఓను సవరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌కు లేఖ రాశాను.’

సీఎస్‌ ఎదురుదాడి చేయడమేంటి: నాగభూషణం

ఈనాడు, అమరావతి: తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించుకోకుండా, నిజాలు బయటపెట్టినవారిపై సీఎస్‌ జవహర్‌రెడ్డి ఎదురుదాడి చేయడం, కేసులు పెట్టడం తగదని భాజపా రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని