దేశంలో మరో ఆర్నెల్లలో.. భారీ రాజకీయ భూకంపం

జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాత మరో ఆర్నెల్లలో దేశంలో భారీ రాజకీయ భూకంపం రానుందని ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు.

Updated : 30 May 2024 05:41 IST

కుటుంబ పార్టీల విచ్ఛిన్నం ఖాయం
బెంగాల్, ఒడిశా సభల్లో ప్రధాని మోదీ

కాక్‌ద్వీప్‌ (పశ్చిమబెంగాల్‌)/బరిపద, బాలేశ్వర్‌ (ఒడిశా): జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాత మరో ఆర్నెల్లలో దేశంలో భారీ రాజకీయ భూకంపం రానుందని ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. వంశపారంపర్య రాజకీయాలతో అభివృద్ధి చెందుతున్న రాజకీయ పార్టీలు వాటంతట అవే విచ్ఛిన్నం అవుతాయన్నారు. ఇటువంటి పార్టీల తిరోగమన రాజకీయాలతో ఆయా పార్టీల్లోని నాయకులే విసిగిపోయి ఉన్నట్లు తెలిపారు. బుధవారం పశ్చిమబెంగాల్, ఒడిశా ఎన్నికల సభల్లో ప్రధాని ప్రసంగించారు. బెంగాల్‌లోని కాక్‌ద్వీప్‌ సభలో మాట్లాడుతూ.. అక్రమ చొరబాటుదారుల కారణంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జనాభా లెక్కలు తారుమారు అవుతున్నాయని, స్థానిక యువత అవకాశాలను వారు లాక్కొంటున్నారని తెలిపారు. ఇటువంటి వాళ్లను ప్రోత్సహిస్తూ జాతీయ భద్రతతోనూ టీఎంసీ ప్రభుత్వం రాజీ పడుతోందన్నారు. ఓ వర్గాన్ని బుజ్జగించేందుకు టీఎంసీ బహిరంగంగానే రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. బెంగాల్‌లో పలు కులాలకు మంజూరుచేసిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ మే 22న కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి   తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ ముస్లింలను టీఎంసీ పక్కదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించారు.  

నవీన్‌ పట్నాయక్‌ అనారోగ్యం వెనుక కుట్ర!

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణించడం వెనుక కుట్ర జరిగి ఉండవచ్చని మోదీ అభిప్రాయపడ్డారు. ఇటీవల తనను కలిసిన కొంతమంది ప్రముఖులు నవీన్‌ ఆరోగ్యం క్షీణించిన విషయం ప్రస్తావించారన్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైతే ఓ ప్రత్యేక కమిటీతో దీనిపై దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఒడిశాలోని బరిపద, బాలేశ్వర్, కేంద్రపాడా ర్యాలీల్లో ప్రధాని మాట్లాడుతూ.. ఏడాదికాలంగా నవీన్‌ బాబు ఆరోగ్యం బాగా క్షీణించిందని, ముఖ్యమంత్రికి బదులుగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్న లాబీ దీనికి బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు.  కేంద్రపాడా సభలో ఓ వృద్ధురాలికి మోదీ మోకరిల్లి నమస్కరించారు. బరిపద సభలో ఓ టీవీ జర్నలిస్టు వడదెబ్బ సోకి స్పృహతప్పి పడిపోవడం గమనించిన ప్రధాని ప్రసంగాన్ని మధ్యలో ఆపి, ఆయనకు చికిత్స చేయాల్సిందిగా తన బృందంలోని వైద్యులను కోరారు.  రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాలతోపాటు 147 నియోజకవర్గాలున్న ఒడిశా అసెంబ్లీకి కూడా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని