పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్య పెరుగుతూనే ఉంది: రాహుల్‌

పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్య ఇంకా పెరుగుతూనే ఉందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 30 May 2024 03:44 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్య ఇంకా పెరుగుతూనే ఉందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కఠిన చర్యలతో దానికి అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. లుధియానాలోని డాఖాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తుందని, రైతుల రుణాలను మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందంటూ భాజపాపై రాహుల్‌ మండిపడ్డారు. హత్యకు గురైన గాయకుడు సిద్ధూ మూసేవాలా ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి లుధియానాలో రాహుల్‌ పుష్పాంజలి ఘటించారు. దేశమంతా ఒకే వ్యక్తి పాలనలో ఉండాలని భాజపా కోరుకుంటోందంటూ పటియాలా ర్యాలీలో కాంగ్రెస్‌ అగ్రనేత ధ్వజమెత్తారు.


హిమాచల్‌లో పర్యాటక రంగాన్ని కేంద్రం నాశనం చేస్తోంది: ప్రియాంక

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో పర్యాటక రంగం సహా చిన్న, మధ్య తరహా వ్యాపారాలన్నింటినీ కేంద్రంలోని భాజపా సర్కారు నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ఆరోపించారు. వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) అమలు, నోట్ల రద్దు వంటి చర్యలతో ప్రధానంగా పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు. కుల్లూలో బుధవారం ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. అన్ని వ్యాపారాలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని