మోదీని దేవుణ్ని చేసేశారు

మోదీని భాజపా నేతలు దేవుణ్ని చేసేశారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. విష్ణుమూర్తి 11వ అవతారంగా ఆయన్ను కీర్తిస్తున్నారని, కానీ ప్రజలు దాన్ని అంగీకరించరని పేర్కొన్నారు.

Updated : 30 May 2024 05:41 IST

భాజపా నేతలపై ఖర్గే ఆగ్రహం 

భువనేశ్వర్, న్యూస్‌టుడే: మోదీని భాజపా నేతలు దేవుణ్ని చేసేశారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. విష్ణుమూర్తి 11వ అవతారంగా ఆయన్ను కీర్తిస్తున్నారని, కానీ ప్రజలు దాన్ని అంగీకరించరని పేర్కొన్నారు. ఒడిశాలోని బాలేశ్వర్, భద్రక్‌లలో బుధవారం కాంగ్రెస్‌ జన ఆశీర్వాద సభలను నిర్వహించారు. వాటిలో ఖర్గే మాట్లాడుతూ.. పూరీ లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి సంబిత్‌ పాత్రా జగన్నాథుడు మోదీ భక్తుడని వ్యాఖ్యానించిన సంగతిని గుర్తుచేశారు. ఇంతకంటే దురదృష్టం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీలిచ్చిన మోదీ గత పదేళ్లలో ఏం సాధించారంటూ ఖర్గే నిలదీశారు. ఆయన పెట్టుబడిదారులతో చేతులు కలిపి పేదల పొట్ట కొట్టారని ఆరోపించారు. కులాలు, మతాలు, జాతుల మధ్య మోదీ చిచ్చు పెట్టారని.. పవిత్ర భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ పేరు చెబితే కాంగ్రెస్‌ నేతలు బెదిరిపోతున్నారని ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి ఆ దేశాన్ని రెండుగా విభజించిన సంగతిని మోదీ విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. 

అబద్ధం తట్టాబుట్టా సర్దుకోవాల్సిన సమయం వచ్చేసింది 

‘గాంధీ’ సినిమా వచ్చేదాకా ప్రపంచానికి మహాత్మాగాంధీ గురించి తెలియదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నాథూరాం గాడ్సేతో కలిసి మహాత్మాగాంధీ హత్యలో పాలుపంచుకున్నవారి సైద్ధాంతిక వారసులు మహాత్ముడు చూపిన సత్య మార్గంలో ఎన్నటికీ నడవలేరని పేర్కొన్నారు. ప్రస్తుతం అబద్ధం తట్టాబుట్టా సర్దుకోవాల్సిన సమయం వచ్చేసిందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం స్పందిస్తూ.. ‘‘మోదీ ఎప్పుడైనా ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ పేరు విన్నారా? గాంధీ గురించి ఐన్‌స్టీన్‌ ఏమన్నారో ఆయనకు తెలుసా? 1955లో మరణించిన ఐన్‌స్టీన్‌కు 1982లో వచ్చిన ‘గాంధీ’ సినిమా చూస్తేనే మహాత్ముడి గురించి తెలిసిందా?’’ అని ఎక్స్‌లో వ్యంగ్యంగా ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు