ఎన్నికల్లో ప్రజలందరి భాగస్వామ్యానికి ఈసీ కృషి

సార్వత్రిక ఎన్నికల చివరి దశలలో అన్ని వర్గాల ప్రజల ఓటర్లలో అమితోత్సాహం కనిపించిందని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది.

Updated : 30 May 2024 05:44 IST

సీఈసీ రాజీవ్‌ కుమార్‌ వెల్లడి

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరి దశలలో అన్ని వర్గాల ప్రజల ఓటర్లలో అమితోత్సాహం కనిపించిందని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు సహా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారని పేర్కొంది. 85 ఏళ్లకు పైబడిన వయోధికులకు, 40శాతానికి పైగా వైకల్యం ఉన్న వ్యక్తులకు దేశవ్యాప్తంగా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మొట్టమొదటి సారి వారి ఇళ్ల వద్దే ఓటు వేసే అవకాశం లభించిందని వివరించింది. ఎన్నికల  నిర్వహణ ప్రక్రియలో ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాలన్నది తమ దృఢ సంకల్పమన్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఈసీ ఒక ప్రకటనలో ఉద్ఘాటించింది. మన దేశానికి గర్వకారణమైన బహుళత్వం, భిన్నత్వాలను ఎన్నికల్లోనూ ప్రతిబింబించేలా చేయడానికి నిబద్దులమై ఉన్నామని రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలందరినీ సంఘటితంగా కలుపుకునిపోవడం, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడమన్నది ఈసీ ప్రధాన సూత్రమన్నారు. అర్హులైన వారందరికీ ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయానికి ప్రజల నుంచి మంచి ప్రతిస్పందన లభించిందని ఈసీ తెలిపింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని