కేసీఆర్‌ను బద్నామ్‌ చేయడమే రేవంత్‌ లక్ష్యం

కాళేశ్వరం పేరుతో అబద్ధపు ప్రచారాలు, ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలతో కేసీఆర్‌ను బద్నామ్‌ చేయడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

Published : 30 May 2024 03:52 IST

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శ

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం పేరుతో అబద్ధపు ప్రచారాలు, ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలతో కేసీఆర్‌ను బద్నామ్‌ చేయడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష పెడితే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయని రేవంత్‌ మాట్లాడడం అవివేకమని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో ప్రజాప్రతినిధిని కొనుగోలు చేయడానికి వెళ్లి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్‌కు లై డిటెక్టర్‌ పెడితే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘చంద్రబాబు, వైఎస్‌ హయాంలో జరిగిన ఎన్‌కౌంటర్లు ఫలానా వాళ్లు చెబితే చేశామని ఎవరైనా పోలీసు అధికారులు చెబుతారా? ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన విషయం తెలిసినా దాన్ని మేం పట్టించుకోలేదు. ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది వ్యవస్థలో భాగంగా ఆయా సంస్థల పరిధిలో జరిగేది. టెలిగ్రాఫ్‌ చట్టం ప్రకారం ప్రభుత్వంలోని అధికారులు నిర్ణయం తీసుకుని ఫోన్‌ ట్యాపింగ్‌ చేయవచ్చు. ఇప్పుడు మల్లన్న సాగర్‌ నుంచి మూసీకి, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు ఏడు టీఎంసీలు తెస్తామంటున్నారు. కాళేశ్వరం విఫల ప్రాజెక్టు అయితే మరి నీళ్లెలా తెస్తారు? హామీల అమలు, మెరుగైన పాలనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టిపెట్టాలి’’ అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు