సంక్షిప్త వార్తలు (6)

ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఒడిశాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరారు.

Updated : 30 May 2024 05:49 IST

ఒడిశా ఎన్నికల ప్రచారానికి భట్టి

హైదరాబాద్, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఒడిశాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరారు. గురువారం ఉదయం భువనేశ్వర్‌ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి భద్రలోక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. గత వారం రోజులుగా భట్టి పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకున్నారు. తిరిగి రాత్రి ఒడిశా వెళ్లారు.


పీసీసీ లీగల్‌సెల్‌ కన్వీనర్‌గా ఇనాయతుల్లా

హైదరాబాద్, న్యూస్‌టుడే: పీసీసీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌గా హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది మహ్మద్‌ ఇనాయతుల్లా నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ లీగల్‌ సెల్‌ ఛైర్మన్‌ పొన్నం అశోక్‌గౌడ్‌ బుధవారం ఆయన నియామకాన్ని ప్రకటించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌లో అరెస్టైన అధికారుల సర్వీసు రద్దు చేయాలి 

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టైన అధికారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతోపాటు వారి సర్వీసును రద్దు చేయాలని పీసీసీ అధికార ప్రతినిధులు చనగాని దయాకర్‌గౌడ్, మహ్మద్‌రియాజ్లు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. వారు బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


‘ఇండియా’ ఓటమి తర్వాత ఈవీఎంలపై నిందలే

ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి కూడా లేరు. ఓట్ల లెక్కింపు జరిగే రోజు మధ్యాహ్నం ఇద్దరు యువరాజులు (రాహుల్‌ గాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌) మీడియా సమావేశం ఏర్పాటుచేస్తారు. ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని, తమ ఓటమికి అవే కారణమని నిందిస్తారు. ఇది పక్కా. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. రాహుల్‌బాబాకి 40 సీట్లు కూడా రావు. మరో యువరాజుకు 4 సీట్లు వస్తాయి. యూపీలో ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటుకూ దిక్కు ఉండేది కాదు. భాజపా వచ్చి ఎన్నింటినో మెరుగుపరిచింది.

ఉత్తరప్రదేశ్‌లోని వేర్వేరు బహిరంగ సభల్లో కేంద్ర మంత్రి అమిత్‌షా


ప్రాయశ్చిత్తం కోసం కన్యాకుమారికి వెళ్తే మంచిదే 

వివేకం అంటే ఏమిటో అర్థం చేసుకోని వ్యక్తి ఏం ధ్యానం చేయగలరు? కన్యాకుమారిలోని వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానం కోసం వెళ్తున్నది ప్రాయశ్చిత్తం కోసమైతే మాత్రం మంచిదే. వివేకానందుని బోధనల నుంచి స్ఫూర్తి పొందడానికి వెళ్లినా మంచిదే. 60 నెలలు అధికారమిస్తే సరికొత్త దేశాన్ని చూపిస్తామని 120 నెలలు పాలించి కూడా సాధించిందేమీ లేకపోవడం వల్లనే ముజ్రా, మంగళసూత్ర, ఓట్‌ జిహాద్‌ అని ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. 

చండీగఢ్‌లో విలేకరులతో రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ 


భాజపా మళ్లీ నెగ్గితే భూములు లాక్కొంటుంది

కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం ఏర్పడితే రైతులు, ఆదివాసీల భూముల్ని లాక్కొంటుంది. దానికోసం చట్టం చేస్తుంది. ఇండియా కూటమిని గెలిపిస్తే రికార్డుస్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తుంది. రైతు రుణాలను మాఫీ చేస్తుంది. అగ్నివీర్‌ పథకాన్ని రద్దుచేస్తుంది. 

యూపీలోని ఛోటేలాల్‌ ఖర్వార్‌ సభలో సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌


వైకాపా ప్రభుత్వంలో విచ్చలవిడిగా భూ మాఫియా

భాజపా నేత లంకా దినకర్‌ ధ్వజం

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: భూ మాఫియాను విచ్చలవిడిగా ప్రోత్సహించిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఆరోపించారు. విశాఖలోని భాజపా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పవర్‌ ప్రాజెక్టుల పేరుతో సీఎం జగన్‌ భూ సంతర్పణలు చేశారని ఆరోపించారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండో సోలార్‌ సంస్థలకు భారీఎత్తున భూములు కట్టబెట్టారని మండిపడ్డారు. ఎంఓయూలు చేయకుండా జీవోలు జారీచేసిన ఘనత జగన్‌ సర్కారుదేనన్నారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 32 వేల ఎకరాలను నామమాత్రపు ధరలకు ఇచ్చారని.. రూ.500 కోట్లకు మించి టర్నోవర్‌ లేని సంస్థలకు రూ.వేల కోట్ల విలువచేసే భూములు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. దీనిపై ఆడిట్‌ చేయాలని డిమాండు చేశారు. 


వారణాశిలో ఏపీ భాజపా నేతల విస్తృత ప్రచారం

ఈనాడు డిజిటల్, అమరావతి: వారణాశి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ ప్రచార బృందంలో.. రాష్ట్రానికి చెందిన విష్ణువర్థన్‌రెడ్డి, మాధవ్, తపనాచౌదరి, శివన్నారాయణ, నవనీత్‌ ఉన్నారు. గత 12 రోజులుగా వారు వారణాశిలో ప్రచారం చేస్తున్నారు. స్థానికంగా స్థిరపడ్డ తెలుగువారితో భేటీ అవుతూ.. భాజపాకు ఓటేయాలని కోరుతున్నారు.


‘ఓటమి భయంతోనే ఎన్నికల సంఘంపై సజ్జల ఆరోపణలు’

ఈనాడు డిజిటల్, అమరావతి: ఓటమి భయంతోనే ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘గత ఐదేళ్లుగా వైకాపా నాయకులు అరాచక పాలన సాగించారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. తమకు వ్యతిరేక గాలి వీస్తుండటంతో వైకాపా నేతలు ఎన్నికల సంఘాన్ని, ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రజలు వైకాపాకు వ్యతిరేకంగా ఓట్లేశారు’ అని భానుప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని