రేవంత్‌రెడ్డి సమైక్యాంధ్రవాది.. అందుకే రాష్ట్ర చిహ్నంలో మార్పులు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమైక్యాంధ్రవాది అని, ఆయనకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు అంటే ఇష్టం లేదని.. అందుకే రాష్ట్ర చిహ్నంలోని కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్‌లను తొలగించాలని చూస్తున్నారని మాజీ ఎంపీ, భారాస సీనియర్‌ నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌ మండిపడ్డారు.

Published : 30 May 2024 04:04 IST

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌
ఖిలావరంగల్‌ కోటలో భారాస నిరసన

కాకతీయ కళాతోరణం వద్ద నిరసన తెలుపుతున్న రాకేశ్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, నన్నపునేని నరేందర్,
బోయినపల్లి వినోద్‌కుమార్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు

శివనగర్‌(వరంగల్‌), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమైక్యాంధ్రవాది అని, ఆయనకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు అంటే ఇష్టం లేదని.. అందుకే రాష్ట్ర చిహ్నంలోని కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్‌లను తొలగించాలని చూస్తున్నారని మాజీ ఎంపీ, భారాస సీనియర్‌ నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌ మండిపడ్డారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో ప్రభుత్వం మార్పులు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం వరంగల్‌ జిల్లాలోని ఖిలావరంగల్‌ కాకతీయ కోట కీర్తితోరణం వద్ద భారాస చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘తెలంగాణ చరిత్ర, అస్తిత్వాన్ని కనుమరుగు చేయడానికే రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తున్నారు. రాజవంశీయుల చరిత్ర తీసివేయాలనుకుంటున్న రేవంత్‌రెడ్డి.. జాతీయ జెండాలో ఉన్న అశోకచక్రాన్ని తొలగిస్తారా? స్టేట్ ఎంబ్లెమ్‌ ఆఫ్‌ ఇండియా రూల్స్‌ 2007 చట్టం ప్రకారం ఏ రాష్ట్ర చిహ్నంలోనైనా మార్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ ఆ చట్ట ప్రకారం రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించి, కేంద్రం అనుమతి తీసుకున్నారు. వ్యవసాయానికి సాగునీరు అందించిన కాకతీయుల కళాతోరణం, హైదరాబాద్‌లో ప్లేగువ్యాధి వచ్చి వేల మంది చనిపోతుంటే వైద్యం అందించినందుకు గుర్తుగా చార్మినార్‌ను అందులో చేర్చారు. రాష్ట్ర చిహ్నంలో మార్పులపై హైకోర్టుకు వెళ్తాను’’ అని వినోద్‌కుమార్‌ అన్నారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా నిరసన, ధర్నా చేపట్టినందుకు బోయినపల్లి వినోద్‌కుమార్, నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, రాకేశ్‌రెడ్డితో పాటు భారాస కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలపై కేసు నమోదు చేసినట్లు మిల్స్‌కాలనీ సీఐ మల్లయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని