పూరీ జగన్నాథుడు మోదీ భక్తుడా?

‘పూరీ జగన్నాథ ప్రభువు ప్రధాని మోదీకి భక్తుడు’ అంటూ భాజపా నాయకుడు సంబిత్‌ పాత్రా చేసిన వ్యాఖ్యపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది.

Published : 30 May 2024 05:21 IST

ప్రధాని అలానే భావిస్తున్నారా?
సంబిత్‌ పాత్రా వ్యాఖ్యపై కాంగ్రెస్‌ మండిపాటు

దిల్లీ: ‘పూరీ జగన్నాథ ప్రభువు ప్రధాని మోదీకి భక్తుడు’ అంటూ భాజపా నాయకుడు సంబిత్‌ పాత్రా చేసిన వ్యాఖ్యపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. ప్రధాని కూడా నిజంగానే జగన్నాథ ప్రభువును తన భక్తుడిగా భావిస్తున్నారా అని ప్రశ్నించింది. పాత్రా వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులకు అవమానకరమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో బుధవారం ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తనను భగవంతుడే నేరుగా భూమిపైకి పంపించాడంటూ ప్రధాని ఇటీవల పేర్కొనడంపైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారతీయ దేవుళ్లలో మోదీ ఏ దేవగణానికి చెందినవారో చెప్పాలన్నారు. ప్రధాని పశ్చిమ బెంగాల్‌ పర్యటన నేపథ్యంలో ఆయనకు జైరాం రమేశ్‌ పలు ప్రశ్నలు సంధించారు. ధాన్యం సేకరణకు సంబంధించి బెంగాల్‌కు అందాల్సిన రూ.7 వేల కోట్లను మోదీ ఉద్దేశపూర్వకంగానే స్తంభింపజేశారా అని ప్రశ్నించారు. నారదా కుంభకోణంలో భాజపా నేత సువేందు అధికారిపై సీబీఐ నమోదు చేసిన కేసు విచారణలో ముందడుగు పడకపోవడంపై కాంగ్రెస్‌ నేత అనుమానాలు వ్యక్తం చేశారు. అధికార భాజపా పార్టీ ‘వాషింగ్‌ మెషీన్‌’లో ఆ కేసు కొట్టుకుపోయిందా అని ప్రశ్నించారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి మోదీ ప్రభుత్వ అనూహ్య విధానాల కారణంగా రైతులు గత కొన్నేళ్లలో భారీగా నష్టపోయారని జైరాం రమేశ్‌ ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక.. రైతులు, రైతు సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే సంబంధిత విధానాలను రూపొందిస్తుందని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని