వారసులు.. ఇటు గెలుపు.. అటు ఓటమి!

వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించడం సర్వసాధారణమే. కానీ, వారిని గెలిపించుకుని చట్టసభల్లోకి పంపడం అంత సులభం కాదు.

Updated : 05 Jun 2024 04:24 IST

కూటమిలో పోటీచేసిన వారసుల ఘనవిజయం 
జగన్‌ సోదరి, మేనమామ ఓటమి 
బొత్స కుటుంబం ఘోర పరాజయం 
ధర్మాన సోదరుల పరిస్థితీ ఇంతే 
భూమన, చెవిరెడ్డి, పేర్ని వారసులూ ఇంటికే 
వైకాపా అభ్యర్థులకు చేదు అనుభవాలు

ఈనాడు, అమరావతి: వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించడం సర్వసాధారణమే. కానీ, వారిని గెలిపించుకుని చట్టసభల్లోకి పంపడం అంత సులభం కాదు. అందులోనూ కూటమి ప్రభంజనం సృష్టించిన వేళ... తెదేపా నుంచి పోటీ చేసిన పలువురి కుటుంబసభ్యులు సునాయాసంగా విజయ తీరాలు చేరుకుంటే.. అదే సమయంలో వైకాపా నుంచి దిగ్గజాలు అనుకున్న నేతల వారసులు చతికిలపడ్డారు. తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య కాకినాడ జిల్లా తుని, దివంగత వరుపుల రాజా సతీమణి సత్యప్రభ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థులుగా గెలుపొందారు. సత్యప్రభ భర్త వరుపుల రాజా 2019 ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఈయన గత మార్చి నెలలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.

 • తెదేపా అధినేత చంద్రబాబు కుప్పంలో, ఆయన తనయుడు లోకేశ్‌ మంగళగిరిలో గెలిచారు. 
 • చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ హిందూపురంలో విజయం సాధించారు. బాలకృష్ణ మరో అల్లుడు ఎం.శ్రీభరత్‌ విశాఖ ఎంపీగా గెలిచారు.  
 • రాజంపేట లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఓడిపోయారు. ఆయన సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి పీలేరులో తెదేపా నుంచి గెలిచారు. 
 • టెక్కలిలో కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్‌నాయుడు విజయం సాధించారు. వాళ్లిద్దరూ బాబాయ్, అబ్బాయ్‌ అవుతారు.
 • అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి తాడిపత్రి నుంచి గెలిచారు. శ్రీసత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి కోడలు సింధూరరెడ్డి పుట్టపర్తి నుంచి గెలిచారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నుంచి మాజీమంత్రి రామచంద్రారెడ్డి వారసురాలు సవిత గెలిచారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నుంచి పోటీచేసిన కృష్ణచైతన్యరెడ్డి గెలిచారు. ఈయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు. 
 • డోన్‌ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి గెలిచారు. ఈయన తండ్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ రెండోసారి గెలిచారు. ఈమె తల్లిదండ్రులిద్దరూ ప్రజాప్రతినిధులే. కర్నూలు తెదేపా అభ్యర్థి భరత్‌ గెలిచారు. ఈయన టీజీ వెంకటేశ్‌ కుమారుడు. ఎమ్మిగనూరు నుంచి నాగేశ్వరరెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు. ఈయన తండ్రి దివంగత నేత బీవీ మోహన్‌రెడ్డి. 
 • విజయనగరంలో కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్‌గపతిరాజు కుమార్తె పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు తెదేపా తరఫున గెలిచారు.
 • రాజమహేంద్రవరం అర్బన్‌ తెదేపా అభ్యర్థిగా గెలిచిన వాసు.. మాజీ ఎమ్మెల్యే భవాని భర్త.
 • అమలాపురం తెదేపా అభ్యర్థిగా గెలిచిన గంటి హరీష్‌ మాథుర్‌ దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కుమారుడు
 • తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తనయుడు కుమారరాజా పామర్రులో గెలిచారు. 
 • శింగనమల నుంచి తెదేపా నేత బండారు నారాయణస్వామి మనవరాలు బండారు శ్రావణిశ్రీ తెదేపా తరఫున పోటీచేసి గెలిచారు. 
 • బొబ్బిలిలో ఆర్‌.వి.ఎస్‌.కె.కె. రంగారావు (బేబినాయన) తెదేపా నుంచి గెలిచారు. ఈయన మాజీమంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు సోదరుడు.
 • శ్రీకాకుళం జిల్లా పలాసలో తెదేపా తరఫున సర్దార్‌ గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష పోటీచేసి.. మంత్రి సీదిరి అప్పలరాజుపై గెలిచారు. 
 • సూళ్లూరుపేటలో మాజీమంత్రి నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవల విజయశ్రీ తెదేపా అభ్యర్థిగా పోటీచేసి కిలివేటి సంజీవయ్యపై గెలిచారు. 
 • శ్రీకాళహస్తి నుంచి మాజీ మంత్రి, దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి తెదేపా తరఫున గెలిచారు. 
 • మచిలీపట్నంలో తెదేపా నేత కొల్లు రవీంద్రపై మాజీమంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టూ) పోటీచేసి ఓడిపోయారు. 
 • చీరాలలో వైకాపా తరఫున ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్‌ పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ గెలిచిన మాలకొండయ్య... సినీహీరో నిఖిల్‌కు మామ. 
 • తాడిపత్రి, ధర్మవరం స్థానాల నుంచి పోటీచేసిన బాబాయ్‌.. అబ్బాయిలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడారు. 
 • గంగాధరనెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి ఓటమి చవిచూశారు.

ముగ్గురు వియ్యంకుల గెలుపు

భీమిలి, నెల్లూరు నియోజకవర్గాల నుంచి గెలుపొందిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ వియ్యంకులు. భీమవరం నుంచి గెలుపొందిన పులపర్తి రామాంజనేయులు కూడా గంటా వియ్యంకుడే. 


జగన్, అవినాష్‌రెడ్డి గెలుపు

పులివెందుల అసెంబ్లీ నుంచి జగన్, ఆయన సోదరుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి కడప లోక్‌సభ నుంచి గెలిచారు. జగన్‌ మేనమామ పి.రవీంద్రనాధ్‌రెడ్డి కమలాపురం అసెంబ్లీ, సోదరి షర్మిల కాంగ్రెస్‌ తరఫున కడప లోక్‌సభ నుంచి పోటీచేసి ఓడారు.


కుమారుడు ఎంపీ... తండ్రి ఎమ్మెల్యే

డప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి పుట్టా సుధాకర్‌యాదవ్, ఆయన కుమారుడు మహేశ్‌ యాదవ్‌ ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి తెదేపా అభ్యర్థులుగా గెలిచారు.


పెద్దిరెడ్డి కుటుంబసభ్యుల విజయం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6,905 ఓట్ల తేడాతో పుంగనూరులో గెలిచారు ఆయన సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి తంబళ్లపల్లెలో, తనయుడు మిథున్‌రెడ్డి రాజంపేట లోక్‌సభస్థానంలో గెలిచారు.


తండ్రీ కుమారుల ఓటమి

ణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ స్థానంలో ఆయన కుమారుడు సునీల్‌కుమార్‌ వైకాపా నుంచి పోటీచేసి ఓడారు. 

ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు, చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి మోహిత్‌రెడ్డి ఓడిపోయారు.


తండ్రీ కుమార్తెల ఓటమి

పముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి లోక్‌సభ స్థానంలోను, ఆయన కుమార్తె ఈర్లె అనురాధ మాడుగుల అసెంబ్లీ స్థానంలోను వైకాపా తరఫున ఓడిపోయారు. 


సోదరుల ఓటమిబాట

న్నదమ్ములైన ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్‌ ఇద్దరూ శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఓడిపోయారు. 

 • మంత్రి ఆదిమూలపు సురేష్‌ కొండపిలోను, ఆయన సోదరుడ[ు సతీష్‌ కోడుమూరులోను పరాజయం పాలయ్యారు. 
 • మేకపాటి రాజగోపాలరెడ్డి ఉదయగిరి, ఈయన అన్న కుమారుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆత్మకూరు స్థానాల నుంచి పోటీచేసి ఓడారు. 

బొత్స కుటుంబానికి లేదు బోణీ

మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ఘోర పరాజయం పాలైంది. ఆయన చీపురుపల్లి, తమ్ముడు అప్పలనరసయ్య గజపతినగరం అసెంబ్లీ స్థానాల నుంచి ఓడారు. బొత్స ఝాన్సీలక్ష్మి విశాఖ లోక్‌సభ స్థానంలో ఓడారు. బొత్స మేనల్లుడు చిన్నశ్రీనుకు వియ్యంకుడైన బడ్డుకొండ అప్పలనాయుడు కూడా నెల్లిమర్లలో ఓడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని