వైకాపా @11 స్థానాలు

అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాల్లో విజయం సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఉమ్మడి ఏపీలో కూడా లేనంతగా అతి తక్కువ స్థానాలు వైకాపాకు లభించాయి.

Published : 05 Jun 2024 04:12 IST

ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనట్లే 

ఈనాడు, అమరావతి: అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాల్లో విజయం సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఉమ్మడి ఏపీలో కూడా లేనంతగా అతి తక్కువ స్థానాలు వైకాపాకు లభించాయి. వైనాట్‌ 175 అంటూ ప్రచారం చేసుకున్న ఆ పార్టీ చివరికి ప్రతిపక్ష హోదాను సైతం పొందలేక చతికిలపడింది. ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేసిన వైకాపాకు కేవలం 11 స్థానాలు దక్కాయి. ఉమ్మడి ఏపీలో 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మిత్రపక్షాలతో సంబంధం లేకుండా ఒక్క తెదేపానే 216 సీట్లలో విజయం సాధించగా.. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీకి 26 స్థానాలు దక్కాయి. విభజిత ఏపీలో 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు 151 స్థానాలు లభించగా.. తెదేపాకు 23 దక్కాయి. ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి వైకాపా పరిస్థితి దారుణంగా మారింది. 175 స్థానాల్లో పోటీ చేసినా 11 సీట్లకే పరిమితమైంది. పక్కనున్న తమిళనాడులో 1991 శాసనసభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే 225 స్థానాల్లో విజయం సాధించగా.. డీఎంకే 7 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 1996కు వచ్చేసరికి ఈ ఫలితాలు తిరగబడ్డాయి. ఆ ఎన్నికల్లో డీఎంకే 221 స్థానాల్లో విజయం సాధించగా.. ఏఐఏడీఎంకే 4 స్థానాలకు పరిమితమైంది. 

ప్రతిపక్ష నాయకుడైనా కాలేదు.. 

తాజా ఎన్నికల్లో వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కనీసం 18 స్థానాల్లోనైనా విజయం సాధిస్తే ఆ హోదా దక్కేది. కానీ, వైకాపా 11కే పరిమితమైంది. అంటే ఏడడుగుల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో వైకాపా అధినేత జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కనట్లే. మామూలు ఎమ్మెల్యేగా వ్యవహరించాల్సిందే. ఒకవేళ జనసేన ఎన్డీయే కూటమిలో మిత్రపక్షంగా లేకుండా ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లభించేది. ఆ పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ విజయ ఢంకా మోగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు