వైకాపాను ఈడ్చికొట్టిన ఎస్సీ, ఎస్టీలు

ఎస్సీ, ఎస్టీలు అందరిదీ ఒకే జపం..అదే కూటమి విజయం. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 27 చోట్ల తెదేపా, మిత్రపక్షాలు గెలుపొందాయి. 7 ఎస్టీ నియోజకవర్గాలకుగాను 5 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.

Published : 05 Jun 2024 04:13 IST

ఈనాడు, అమరావతి: ఎస్సీ, ఎస్టీలు అందరిదీ ఒకే జపం..అదే కూటమి విజయం. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 27 చోట్ల తెదేపా, మిత్రపక్షాలు గెలుపొందాయి. 7 ఎస్టీ నియోజకవర్గాలకుగాను 5 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. గత ఎన్నికల్లో కొండపి మినహా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలన్నింటినీ వైకాపానే కైవసం చేసుకుంది. సంప్రదాయంగా ఒకప్పుడు కాంగ్రెస్‌కు, ఆ తర్వాత వైకాపాకు ఎన్నికల్లో గెలుపునకు వెన్నెముకగా నిలిచిన ఈ వర్గాలు..ఈ సారి వైకాపా వెన్నువిరిచాయి. 

27 ఎస్సీ నియోజకవర్గాల్లో విజయదుందుభి...

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 ఎస్సీ రిజర్వుడు శాసనసభ నియోజకవర్గాల్లో 27 చోట్ల కూటమి అభ్యర్థులే విజయదుందుభి మోగించారు. మంత్రులు, వైకాపా తరఫున పోటీ చేసిన హేమాహేమీలు కూటమి దెబ్బకు మట్టికరిచారు. ఉత్తరాంధ్ర మొదలు రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ ఈ నియోజకవర్గాల్లో గెలుపు సునాయాసమైంది. రాజాం, పార్వతీపురం, పాయకరావుపేట, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడి, పామర్రు, తిరువూరు, నందిగామ, తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు, సంతనూతలపాడు, కొండపి,  కోడుమూరు,  నందికొట్కూరు, శింగనమల, మడకశిర,  రైల్వేకోడూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో తెదేపా, మిత్రపక్షాలు విజయం సాధించాయి. కేవలం యర్రగొండపాలెం, బద్వేలులో మాత్రమే చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన వైకాపా గట్టెక్కింది.

ఎస్టీ నియోజకవర్గాల్లోనూ ఇదే వరస

వైకాపా ఆవిర్భావం నుంచి ఎస్టీ నియోజకవర్గాలు ఆ పార్టీకి కంచుకోటలు. జగన్‌కు ఉన్న కీలకమైన ఓటు బ్యాంకులో గిరిజనులు అగ్రస్థానంలో ఉంటారు. అలాంటి స్థానాల్లో కూడా మెజారిటీ చోట్ల కూటమి అభ్యర్థులే గెలుపొందారు. 7 ఎస్టీ శాసనసభ నియోజకవర్గాల్లో 5 చోట్ల వారి హవానే కొనసాగింది. పాలకొండ, కురుపాం, సాలూరు, రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాల్లో తెదేపా, మిత్రపక్షాలు గెలుపొందాయి. అరకు వ్యాలీ, పాడేరులో మాత్రమే వైకాపా విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని