అటు ఇటు చేసినా ఫలితం సున్నా

గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరిని ఎంపీ అభ్యర్థులుగా, ఎంపీలుగా ఉన్న మరికొందరిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైకాపా ప్రకటించినా వారు ఓటమి పాలయ్యారు.

Published : 05 Jun 2024 05:00 IST

ఎంపీ అభ్యర్థులుగా కొందరు వైకాపా ఎమ్మెల్యేలు..
ఎమ్మెల్యే స్థానాల్లో నిలబడిన ఎంపీలు..
ఓటమి పాలైన నాయకులు

ఈనాడు, అమరావతి: గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరిని ఎంపీ అభ్యర్థులుగా, ఎంపీలుగా ఉన్న మరికొందరిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైకాపా ప్రకటించినా వారు ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు నలుగురు శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. శాసనసభ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ఆరుగురు ఇలాగే ఓటమి పాలవడం గమనార్హం. జనసేన అధినేత పవన్‌కల్యాణ్కు ప్రత్యర్థిగా పిఠాపురం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన కాకినాడ ఎంపీ వంగా గీత ఓటమి పాలయ్యారు. ఆమె 2019లో కాకినాడ ఎంపీగా గెలిచారు. రాజమహేంద్రవరం లోక్‌సభ సభ్యుడు భరత్‌రామ్‌ ఈ సారి రాజమహేంద్రవరం అర్బన్‌ అసెంబ్లీ నుంచి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం అసెంబ్లీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ తూర్పు నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి చవిచూశారు. 

లోక్‌సభకు పోటీ చేసిన వారికీ పరాజయమే

పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య గుంటూరు నుంచి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒంగోలు నుంచి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అనంతపురం నుంచి లోక్‌సభకు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. మాడుగుల ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయగా.. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. వీరిద్దరూ పరాజయం పాలయ్యారు. కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఈ ఎన్నికల్లో అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి ఓడారు. 2019 ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున రాజోలు నుంచి గెలుపొందారు. అనంతరం వైకాపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని