రఘు‘రామబాణం’.. ఉండిలో రికార్డు మెజార్టీ

వైకాపా సర్కారుపై సుదీర్ఘ పోరాటం చేసిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రస్తుత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రికార్డు మెజార్టీతో గెలిచారు.

Updated : 05 Jun 2024 12:29 IST

ఉండి, న్యూస్‌టుడే: వైకాపా సర్కారుపై సుదీర్ఘ పోరాటం చేసిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రస్తుత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రికార్డు మెజార్టీతో గెలిచారు. ఇక్కడ తెదేపా తరఫున అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆయన పోస్టల్‌ బ్యాలట్‌ సహా అన్ని రౌండ్లలోనూ స్పష్టమైన అధిక్యాన్ని ప్రదర్శించి 56,777 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఉండి నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ.

ప్రతిష్ఠాత్మకంగా..: ఉండి నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నామినేషన్లకు ముందే ఈ సీటును సిటింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు అధిష్ఠానం కేటాయించింది. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు (కలవపూడి శివ) రెబల్‌గా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. నరసాపురం నుంచే ఎంపీగా పోటీచేయాలని రఘురామ భావించినా, భాజపాతో సీట్ల సర్దుబాటు కారణంగా సాధ్యం కాలేదు. ఈ దశలో తన స్వస్థలమైన ఉండి నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలో దిగారు. అప్పటికే ఎమ్మెల్యే రామరాజు ప్రచారంలో దూసుకెళ్తుండగా ఈ నిర్ణయం వెలువడటంతో ఆయన అనుచరులు, పార్టీశ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు రామరాజుకు నచ్చజెప్పి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. చంద్రబాబు సైతం ఉండి సభలో రామరాజును వాహనంపైకి పిలిచి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించడం తెదేపా క్యాడర్‌లో నూతనోత్సాహం నింపింది.


జగన్‌ శేషజీవితం గడపాలి

-రఘురామ

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: చంద్రబాబు కష్టం, పవన్‌ త్యాగం వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని రఘురామకృష్ణరాజు అన్నారు. ఇకనైనా జగన్‌ ఇంట్లోనే ఉంటూ పిల్లల పెళ్లిళ్లు చేసి శేషజీవితం గడపాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు